ఇద్దరు చంద్రులు ఫ్రంట్ లకు టెంట్ లు లేవు

టీడీపీ అధినేత చంద్రబాబు ఓ వైపు.. మరో వైపు గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా ఇద్దరు చంద్రులు ఢిల్లీ వేదికగా చక్రం తిప్పాలని భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే ఇద్దరు చంద్రులు ఫెడరల్ ఫ్రంట్, ఫ్యామిలీ ఫ్రంట్‌కు టెంటు లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా కె లక్ష్మణ్ తేల్చిచెప్పేశారు. ఒకాయన అడవి బాట పడితే.. ఒకాయన ఢిల్లీ, కోల్‌కత్తా ఇలా భేటీలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. 

టీడీపీని సోనియాగాంధీ కాళ్ల దగ్గర.. తాకట్టు పెట్టారు. కొన్ని మీడియా సంస్థలు కూడా చంద్రబాబు చక్రం తిప్పుతారని.. కేసీఆర్ బొంగరం తిప్పుతారని వంత పాడారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే.కేసీఆర్.. బీజేపీ యేతర ప్రభుత్వం అని.. కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతు అంటున్నారు" అని తెలిపారు. 

కత్తులు దూసుకునే పార్టీలు పొత్తులు పెట్టుకోవడం ప్రజలు ఒప్పుకోలేదని, రెండు తెలుగు రాష్ట్రాలకు చంద్ర గ్రహణం వీడుతోన్నదని సంతోషం ప్రకటించారు. ఓటమికి చంద్రబాబు సాకులు వెతుకుతున్నారని చెబుతూ యూ టర్న్ మహానుభావుడు ట్యాపరింగ్ జరిగింది అని.. నేనే గెలుస్తా అని.. పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

2014లో మీరు గెలిస్తే ఈవీఎంలు బాగా పని చేసాయా..? మొన్న 3 రాష్ట్రాలు బీజేపీ ఓడిపోతే ఎందుకు గుర్తు లేదు. ఈవీఎంలు విచిత్ర మెంటాలిటీలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. ట్యాపరింగ్ జరిగిందని మళ్ళీ నేనే గెలుస్తా అనడం దానికి కొన్ని సంస్థలు, వ్యక్తులు వంతపాడటం విడ్డూరంగా ఉన్నదని అవహేళన చేశారు. 

అసంతృప్త టీఆర్ఎస్ వాదులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మరింత మంది బీజేపీ వైపు వస్తారు. తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు రాబోతున్నాయి. తెలంగాణలో ఎగ్జిట్‌ పోల్‌ను మించి మాకు సీట్లు వస్తాయని లక్ష్మణ్ జోస్యం చెప్పారు.