తొమ్మిది సర్వేల్లో వైసిపి, మూడింటిలో టిడిపి

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌లో ఒక్కో సంస్థ ఒక్కో విధమైన అంచనాలు వెల్లడించాయి. సర్వేల పేరుతో ఆయా సంస్థలకు వచ్చిన సమాచారాన్ని ప్రకటించాయి.

 ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి లోక్‌సభ, అసెంబ్లీ రెండింటిలోనూ వైసీపీదే హవా అని అత్యధిక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారని చెబుతున్నాయి. 

వీటిల్లో ఆంధ్ర ప్రదేశ్ లో తొమ్మిది సంస్థలు వైసిపికి అనుకూలంగా అంచనాలు ఇచ్చాయి. మూడు సంస్థలు టిడిపికి అనుకూలంగా నివేదికలు వెల్లడించాయి. ఎలైట్‌, రాజగోపాల్‌కు చెందిన ఆర్‌జి ఫ్లాష్‌, ఐఎన్‌ఎస్‌ఎస్‌ మీడియా సంస్థలు టిడిపికి మెజార్టీ సీట్లు వస్తాయని చెప్పగా ఆరా, రీసెర్చ్‌ ఎఫ్‌ఎక్స్‌, విడిపి అసోసియేట్స్‌, ఇండియా టుడే-యాక్సిస్‌మై ఇండియా, పీపుల్స్‌ పల్స్‌, కెెకెపల్స్‌, ఐపల్స్‌, మిషన్‌ చాణక్య, సంస్థలు వైసిపికి మెజార్టీ వస్తుందని పేర్కొన్నాయి. 

పార్లమెంటు స్థానాల్లో అయితే సర్వే చేసిన ఐదు సంస్థలు పార్లమెంటు నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు వైసిపికి వస్తాయని వెల్లడించాయి.  

వైసీపీ 125-134 అసెంబ్లీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ సంస్థ ప్రతినిధి వేణుగోపాల్ రావు తెలిపారు. ఆ పార్టీకి 48 శాతం ఓట్లు రావొచ్చని పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ 40 శాతం ఓట్లతో 40-45 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పారు. జనసేన ఒక్క స్థానానికే పరిమితమవుతుందని, ఆ పార్టీకి 8 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలిందన్నారు.   

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారం చేపట్టే అవకాశం ఉందని తమ సంస్థ చేపట్టిన ఎగ్జిట్‌పోల్ సర్వేలో తేలినట్లు ఆరా సంస్థ నిర్వాహకుడు షేక్ మస్తాన్ తెలిపారు.  రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 126, టీడీపీ 47, జనసేన 2 సీట్లు సాధించే అవకాశం ఉందని తెలిపారు. ఇక రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ 22, టీడీపీ 3 సీట్లు గెలిచే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల బరిలో నిలిచిన పలువురు ప్రముఖులు తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారని చెప్పారు.