ఒవైసీ బ్రదర్స్‌కు భారీ నజరానా

ఒవైసీ సోదరులు తన శ్రేయోభిలాషులని, మజ్లిస్ పార్టీ తమకు మిత్రపక్షం అని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసెంబ్లీ రద్దుకు ముందు వారికి భారీ నజరానా ప్రకటించారు. గత నాలుగున్నరేళ్లుగా కెసిఆర్ కు వంతపాట పాడుతున్న సోదరులకు భారీ `పరిహారం’ లభించిన్నట్లయింది. హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన స్థలాన్ని సబ్సిడీ రూపంలో అప్పగించారు.

ఈ స్థలానికి సెప్టెంబర్ 2వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గుట్టు చప్పుడు కాకుండా ఆమోద ముద్రవేశారు.  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో బండ్లగూడ మండలంలోని మిథానిలో రూ 25 కోట్ల విలువ చేసే  6,250 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఒవైసీ సోదరులకు రూ.3.75 కోట్లకే ప్రభుత్వం అప్పగించింది. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రతిపాదనను తిరస్కరించడం గమనార్హం.

ఈ స్థలానికి రాష్ట్ర భూ రెవెన్యూ పరిపాలనశాఖ (సీసీఎల్‌ఏ) ఆగమేఘాలతో అనుమతులను జారీచేసింది. ఒవైసీ బ్రదర్స్‌కు అప్పగించిన స్థలానికి ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయంలో సీసీఎల్‌ఏ నో అబ్జక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) ఇవ్వలేదు. అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఎన్‌ఓసీ ఇచ్చి కేటాయించడంలో అంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

బండ్లగూడ మండలంలోని మిథాని వద్ద కేటాయించిన స్థలం బహిరంగ మార్కెట్‌లో గజానికి రూ.40 వేలు వరకూ క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. ఈ లెక్కనా రూ.25 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ.3.75 కోట్లకు ప్రభుత్వం ఒవైసీ బ్రదర్స్ అప్పగించింది. 

మరోవంక, చంద్రాయణ్‌గుట్ట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ భూకబ్జాలు పాల్పడుతున్నాడని, తమ భూములను కూడా లాక్కుంటున్నారని పహీల్వాన్ బ్రదర్స్ హత్యయత్నానికి ప్రయత్నించారని ఆరోపణలు చెలరేగడం తెలిసిందే. అయినప్పటికీ కేసీఆర్ ఒవైసీ బ్రదర్స్‌కు స్థలం కేటాయించి వారితో తన బంధానికి భారీ `మూల్యం’ చెల్లించారా  అనే అనుమానం కలుగుతున్నది.

ఇక అభ్యర్థుల ప్రకటనలో హైదరాబాద్ నగరంలో మజ్లీస్ పోటీ చేసే స్థానాలపై కేసీఆర్ అచితూచి వ్యవహరించారు. యుకూత్‌పూర, నాంపల్లి నియోజక వర్గాలకు మాత్రమే అభ్యర్థులకు ప్రకటించారు. మజ్లీస్‌కు పట్టున్న స్థానాలను అభ్యర్థులను ప్రకటించలేదు. పైగా భవిష్యత్‌లో మజ్లీస్‌తో స్వేహపూరకమైన పోటీ ఉంటుందని ప్రకటించారు. అంటే మజ్లిస్ పోటీ చేసే చోట హిందువుల వోట్లను చీల్చే బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టి వారు గెలిచేటట్లు సహకారం అందించే అవకాశం కనిపిస్తున్నది.

ఈ విషంగా చేయడం వల్లనా హైదరాబాద్‌తో పాటు ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో మజ్లీస్ నుంచి టీఆర్‌ఎస్ లబ్ధిపొందవచ్చునని కేసీఆర్ యోచిస్తున్నట్లు భావిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందగానే ఇంకా ప్రభుత్వం కుడా ఏర్పాటు చేయకుండా ఒవైసీ సోదరుల ఇంటికి కెసిఆర్ స్వయంగా వెళ్లి వారిని మంత్రివర్గంలో చేరమని కోరడం తెలిసిందే. అయితే వారు మంత్రివర్గంలో చేరకుండానే ప్రభుత్వ వ్యవహారాలు పాత బస్తీలో తమ కన్నుసన్నలలో జరిగేటట్లు చేసుకున్నారు.