చంద్రగిరి టిడిపి అభ్యర్థిపై కేసు నమోదు

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో భారీ భద్రత మధ్య రీపోలింగ్‌ కొనసాగుతోంది. చంద్రగిరి టిడిపి  ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని స్వగ్రామం పులివర్తిపల్లిలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. పులివర్తిపల్లిలో ఓటర్లను ప్రలోభపెట్టిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బావమరిది కేశవరెడ్డిని పులివర్తి నాని అడ్డుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నానిపై కేసు నమోదు చేశారు. కేశవరెడ్డి వైసిపి జనరల్‌ ఏజెంటుగా ఉన్నారు.

కమ్మపల్లిలో మునిచంద్రనాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగ ఓటు వేయడానికి వచ్చాడనే అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 11గంటల వరకు కాళేపల్లిలో 36శాతం, వెంకట్రామపురంలో 52శాతం, కొత్తకండ్రిగలో 26శాతం, కమ్మపల్లిలో 23శాతం, ఎన్‌.ఆర్‌ కమ్మపల్లిలో 34శాతం, కుప్పం బాదూరులో 35శాతం, పులివర్తిపల్లిలో 33శాతం పోలింగ్‌ నమోదైంది. 

ఏడు పోలింగ్‌ కేంద్రాల వద్ద దాదాపు 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు వెబ్‌కాస్టింగ్‌ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు.