కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదానే.. చంద్రబాబుకు గడ్డుకాలమే

 గడచిన మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీకి, ప్రధానమంత్రికి ప్రజలు రెండో పర్యాయం బ్రహ్మరథం పట్టబోవడం ఇదే మొదటిసారని, గత ఎన్నికల కన్నా అధిక స్థానాలతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తోందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు జోస్యం చెప్పారు. మోదీయే మళ్లీ ప్రధాని అవుతారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో ప్రతిపక్ష హోదాకు కావలసిన సీట్లను సంపాదించుకుంటే అదే గొప్పని ఎద్దేవా చేశారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రానున్నది గడ్డు కాలమని, అధికారాన్ని కోల్పోతున్న ఆయన అవినీతి చిట్టా బయటకు తీస్తామని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ రెండంకెల సంఖ్యను దాటదని, కేంద్రంలో చక్రం తిప్పాలన్న కోరికతో చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని అన్ని రాష్ట్రాలూ తిరుగుతున్నారని, అయితే 23 తర్వాత ఢిల్లీలో ఆయన్ను ఏ పార్టీ కూడా దగ్గరకు రానివ్వదని వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో టీడీపీ ఓటమి బీజేపీకి శుభసూచకం కానుందని, తమ పార్టీ ఉజ్వల భవిష్యత్‌కు అదే నాంది అని చెప్పారు. బెంగాల్లో 42 ఎంపీ స్థానాలకు గాను బీజేపీ 23 గెలుచుకుంటుందని ధీమాగా చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశాలో కూడా మంచి ఫలితాలను సాధిస్తామన్నారు.