జెనోమ్ వ్యాలీలో రూ.800 కోట్ల ప్రాజెక్టులు

ఆసియాలోనే అతిపెద్ద ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్ క్లస్టర్ జెనోమ్ వ్యాలీ 2.0లో ఏర్పాటు చేస్తున్న రూ.800 కోట్ల విలువైన పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆ రామారావు శంకుస్థాపన చేశారు. ఆయా కంపెనీల శిలా ఫలకాలను బేగంపేటలోని క్యాంపు కార్యాలయం నుంచే ఆవిష్కరించారు. వీటిలో అడ్వాన్స్‌డ్ ఫార్మా, బయోటెక్ ఆర్‌అండ్‌డీ సహా పలు ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఫార్మా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు.

జెనోమ్ వ్యాలీ 2.0 ఏర్పాటులో ప్రభుత్వ దూరదృష్టి ఏంటి అన్నది వారికి వివరించారు. జెనోమ్ వ్యాలీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్, అభివృద్ధిని సింగపూర్‌కు చెందిన సుర్బానా జురంగ్ కంపెనీ చూస్తోందని తెలిపారు. జెనోమ్ వ్యాలీ ద్వారా స్థానిక ఆర్థిక అభివృద్ధితోపాటు లైఫ్ సైన్సెస్ రంగంలో అభివృద్ధిని కోరుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన బయోటెక్ కంపెనీ జెనెసిస్ బయోలాజిక్స్ కంపెనీ సైతం జెనోమ్ వ్యాలీలో తమ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బయోటెక్నాలజీ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసింది.

మూడేండ్ల స్వల్ప వ్యవధిలోనే 6 ఇన్సులిన్ బయోసిమిలర్స్ మోలిక్యుల్స్ అభివృద్ధితో ఈ సంస్థ గొప్ప ఖ్యాతిని గడించింది. మోలిక్యుల్స్ ప్రపంచ విక్రయాలు 30 బిలియన్ డాలర్లకుపైగా ఉన్నట్లు అంచనా. శంకుస్థాపన సందర్భంగా మంత్రి కేటీఆర్ జెనెసిస్ కంపెనీ బృందాన్ని అభినందించారు. ఆరోగ్య పరిరక్షణ, రోగుల భద్రత దృష్ట్యా బయోఫార్మా పరిశ్రమలో బయోసిమిలర్లకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. ఇప్పటికే వ్యాక్సిన్స్, బయోసిమిలర్ల తయారీలో తెలంగాణ రాష్ట్రం తన సత్తా చాటిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.

ఇప్పుడు బయోలాజిక్స్, బయోసిమిలర్ల అభివృద్ధిపైనా జెనోమ్ వ్యాలీ 2.0 వెర్షన్‌లో భాగంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు. జెనెసిస్ బయోలాజిక్స్ వంటి కంపెనీ జెనోమ్ వ్యాలీలో తమ ప్లాంట్‌ను స్థాపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జెనోమ్ వ్యాలీలో మొత్తం రూ.350 కోట్ల విలువైన పెట్టుబడులను పెట్టేందుకు జెనెసిస్ కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయి.

ప్రముఖ దేశీయ ఔషధ రంగ కంపెనీ క్యాడిలా హెల్త్‌కేర్ చైర్మన్ డా.పంకజ్ భాయ్‌పాటిల్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. జెనోమ్ వ్యాలీలో హైటెక్ క్లస్టర్ ఏర్పాటుపట్ల సంతోషం వ్యక్తం చేశారు. జెనెసిస్ కంపెనీ జెనోమ్ వ్యాలీని ఎంచుకోవడం ద్వారా సరైన ప్రదేశాన్ని అభివృద్ధికి ఎంచుకున్నట్టయిందని తెలిపారు.

కెనడాకు చెందిన జెనరిక్ ఔషధ తయారీ సంస్థ జాంప్ ఫార్మా సైతం ఆర్‌అండ్‌డీ, ఎగుమతి ప్రాధాన్య నాణ్యత కలిగిన ఔషధ ఫార్ములేషన్ల తయారీ కోసం ఓ భారీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ను జెనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనున్నది. ఇందుకు రూ.250 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నది. దీనికి సంబంధించి కూడా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దీంతో రాబోయే రెండేండ్లలో ప్రత్యక్షంగా 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.

ఈ సందర్భంగా జాంప్ ఫార్మా కార్పొరేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్, సీఈవో మోన్సీర్ లూయిస్ పిలోన్‌తో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జాంప్ ఫార్మా కంపెనీ కార్యకలాపాలను క్రమంగా హైదరాబాద్‌లో మరింత పెంచాలని పిలోన్‌ను కోరారు. జాంప్ ఫార్మా చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డా.దుత్త మాట్లాడుతూ నవంబర్ 2017లోనే భారత్‌లో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆర్‌అండ్‌డీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ, ఇప్పటివరకు సరైన స్థలం కోసం వెతికి చివరకు హైదరాబాద్‌ను ఎంచుకున్నట్టు తెలిపారు.