ఇద్దరు చంద్రుల మధ్య సానుకూలత !

మొన్నటి వరకు ఎన్నికల ప్రచారం సందర్భంగా పరస్పరం నిప్పులు గక్కుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్ఖ్యమంత్రుల మధ్య ఇప్పుడు సానుకూల సంకేతాలు వెల్లడి అవుతున్నాయి. పోలింగ్ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావన తీసుకు రావడం మానివేశారు. పైగా ఏపీ రాజకీయ వ్యవహారాలలో తమకు ఆసక్తి లేదంటూ కేటీఆర్ చెప్పేసారు. ఎన్నికల సమయంలో వలే జగన్ కు బహిరంగ మద్దతు తెలపడం లేదు. 

మరోవంక చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్న యుపిఎ పక్ష నేతలైన హెచ్ డి కుమారస్వామి, ఏం కె స్టాలిన్ వంటి వార్లతో కేంద్రంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం గురించి కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. కేసీఆర్ కలుస్తున్న వారంతా బిజెపి వ్యతిరేకులు కావడం గమనార్హం. ప్రాంతీయ పార్టీలు అన్ని కలసి కేంద్రంలో బిజెపియేతర, కాంగ్రెయేతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ చెబుతున్న కేసీఆర్  బిజెపికి మద్దతుగా ఉంటున్న ప్రాంతీయ పార్టీల నేతలు ఎవ్వరిని కలవక పోవడం గమనార్హం. 

జాతీయస్థాయి రాజకీయాలలో కేసీఆర్ ను కూడా కలుపుకు పోవాలని మంత్రివర్గ సహచరులతో జరిపిన సమాలోచనలలో చంద్రబాబు పేర్కొన్నట్లు తెలుస్తున్నది. పైగా, కేసీఆరే కాదు.. మోదీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేయడం గమనార్హం. ‘మోదీకి వ్యతిరేకంగా 23 పార్టీలతో మహా కూటమి ఏర్పాటు చేశాం.. కేసీఆర్‌ కలిస్తే 24వ పార్టీ అవుతుందని’ ఆయన పేర్కొన్నారు. 

కేసీఆర్‌, నవీన్‌ పట్నాయక్‌ మీ కూటమికి మద్దతిస్తారన్న నమ్మకం ఏంటి? అన్న ప్రశ్నకు... ‘‘మా కూటమి తలుపులు ఎవరికైనా తెరిచే ఉంటాయి. ఈ నెల 23 తర్వాత మరోసారి కలసి కూర్చుంటాం. ఇంత వరకు మాతో కలవని ఇతర పార్టీలనూ ఆహ్వానిస్తాం. మా కూటమికి ఎలాంటి పేరు పెట్టాలన్నదీ అప్పుడే నిర్ణయిస్తాం. ప్రతి ఒక్కరూ దానిలో చేరతారన్న నమ్మకం ఉంది’’ అని చంద్రబాబు పేర్కొనడం గమనార్హం.