విద్యుత్ వాహనాలకు దీర్ఘకాలిక పాలసీ!

దేశీయంగా విద్యుత్‌తో నడిచే వాహనాలనో ప్రోత్సహించాలంటే దీర్ఘకాలిక విధానాన్ని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి భారత వాహనదారుల తయారీ సంఘం (సియామ్) సూచించింది. ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలతో భవిష్యత్తు పెట్టుబడులకు ఎలాంటి ఉపయోగం లేదని, దీంతో నూతన పాలసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని సియామ్ అద్యక్షుడు అభయ్ ఫిరోదియా సూచించారు.

ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలపై తక్కువ స్థాయిలో పన్ను విధించడం ద్వారా వీటికి ఊతమిచ్చినట్లు అవుతున్నదని వార్షిక సమావేశంలో ఆయన పేర్కొన్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉంటాయని ముందస్తు అంచనావేయడం కష్టమని, ఇందుకు కేంద్రం ప్రకటించే పాలసీ ఇందుకు కేంద్ర బిందువుకానున్నని తెలిపారు.

ఈవీలకు ఊతమివ్వాలంటే ముందుగా తయారీ సంస్థలకు ఆర్థికంగా చేయూతనివ్వాలని, అప్పుడే ఆయా సంస్థలు తయారీ చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పాలసీ నిర్ణయాల్లో 2030 నాటికి 40 శాతం, 2047 నాటికి వంద శాతం పూర్తిచేయాలని కేంద్రానికి సియామ్ విజ్ఞప్తి చేసింది.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కార్ల వాడకం చాలా తక్కువ స్థాయిలో ఉన్నదంటూ అధిక పన్నుల విధింపులతో ఇండస్ట్రీపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నదని చెప్పారు.  ముఖ్యం గా జీఎస్టీలో 28 శాతంతోపాటు మరో 15 శాతం అదనపు సుంకం విధిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అలాగే బీఎస్-6 ఉద్గార నిబంధనలు అమలు చేయాలంటే ఇండస్ట్రీ లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఇట్లా ఉండగా, విద్యుత్‌తో నడిచే వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ఎంపిక చేసిన నగరాలు, జాతీయ రహదారులపై ప్రతి మూడు కిలోమీటర్లకో చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా తెలిపారు.చార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడిన తర్వాతనే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజాదరణ పొందనున్నాయని తెలిపారు. ఈ స్టేషన్ల ఏర్పాటుకు లైసెన్స్ అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు.