దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న బీజేపీ

దేశరాజకీయాలను భారతీయ జనతా పార్టీ ప్రభావితం చేస్తోందని, ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 282 స్థానాలకు మించి విజయం సాధిస్తుందని శాసన మండలి సభ్యులు సోమువీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.  ప్రధానిపై విమర్శలు చేస్తున్న విమపక్షాలకు ఒక అజెండా అంటూ లేకుండా పోయిందని  ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులను విమర్శించడం తప్ప వారికి మరో పని ఉన్నట్లు కనిపించడం లేదన్నారు.

ఇటీవల ప్రధానిపై విమర్శలు చేసిన రాహుల్‌గాంధీ సుప్రీం ఎదుట క్షమాపణలు కోరడం అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఐదేళ్లలో ప్రధాని మోదీ పాలన అత్యభ్యుతంగా సాగిం దని, ఇందులో అనుమానాలకు తావులేదని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరానికి శంకుస్థాపన చేశారని, కడపలో ఉక్కు పరిశ్రమకు పునాది వేశారని, నెల్లూరులో పోర్టు నిర్మించారని గుర్తు చేశారు. 

ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ధ్వజమెత్తారు. ఆయన అవినీతిని పెంచి పోషించాడన్నారు.ఎన్నికలు అయిపోయాక ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారని, 2014లో ఈవింఎంలతోనే గెలిచానన్న విషయం మర్చిపోయాడని ధ్వజమెత్తారు. ఇదే ఈవీఎంలతో మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. ఈవిఎంలను బీజేపీ పెట్టలేదన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. 

రాష్ట్రంలో ఒక్క శ్రీకాకుళం తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో రూ.17 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్లతో 50 సంవత్సరాలుగా జరగని అభివృద్ధిని ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిందని తెలిపారు. రాయలసీమలో కరువు వచ్చిందని, చీనీతోటలు నీరులేక ఎండిపోతున్నాయని తెలిపారు. కేబినెట్ సమావేశాల్లో బాబు ఎక్కువగా కరువుకంటే ఎన్‌ఆర్‌జేసీ బిల్లుల కోసం హడావుడి చేశారని ఎద్దేవా చేశారు. 

కరువుకు సంబంధించి అనంతపురం, కడప జిల్లాల్లో ఎక్కువ నిధులను ఎన్‌ఆర్‌జీసీ నుంచి ఇప్పటికే కేంద్రం ఆంధ్రాకు విడుదల చేసిందని చెప్పారు. రూ.1820 కోట్లు ఎన్‌ఆర్‌జీసీ కింద కేంద్రం విడుదల చేస్తే తమ కార్యకర్తల కోసం చంద్రబాబు వినియోగించారని మండిపడ్డారు. కరవుపై ఛీప్ సెక్రటరీ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆర్థికపరమైన నిధులను రెండురోజుల్లో విడుదల చేయాలని కోరారు.