ప్రధాని పదవిపై మాట మార్చిన ఆజాద్‌

బిజెపిని ఓడించడమే ముఖ్య లక్ష్యమని.. ప్రధాని పదవిపై తమకు పెద్దగా ఆశలు లేవని గురువారం వ్యాఖ్యానించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ తాజాగా మాట మార్చారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్‌ పార్టీకే మద్దతు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. పరోక్షంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోనే ప్రభుత్వ ఏర్పాటు జరగాలని అభిప్రాయపడ్డారు.

‘‘ కాంగ్రెస్‌ ప్రధాని పదవిపై ఆసక్తిగా లేదు అన్న దాంట్లో నిజం లేదు. దేశంలో సుదీర్ఘ చరిత్ర గల అతిపెద్ద పార్టీ మాదే. మాకు అవకాశం ఇవ్వాలి. అయితే ఎన్నికలు జరుగుతున్న సమయంలో మనలో మనమే ప్రధాని పదవి కోసం ఘర్షణ పడటం అంత శ్రేయస్కరం కాదు అని చెబుతూ వచ్చాను. సంప్రదింపుల ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలి’’ అని ఆజాద్‌ పేర్కొన్నారు. 

ఎన్నికల తరవాత కాంగ్రెస్సే అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని.. 273 సీట్లు కచ్చితంగా గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అది తమకు పెద్ద లక్ష్యమే కాదన్నారు. అయితే చివరి దశలో ఈ వాఖ్య కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రతికూలంగా మారుతుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో మాట మార్చిన్నట్లున్నది. 

ఈ ఎన్నికల్లో తమ ముఖ్య లక్ష్యం బీజేపీని గద్దె దించడమేనని.. పీఎం పదవి తమకు పెద్ద సమస్య కాదని ఆజాద్‌ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అన్ని పార్టీలు కలిసి నిర్ణయిస్తేనే నేతృత్వం వహించడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.