300 సీట్లు పైమాటే.. కొత్త భాగస్వాములను స్వాగతిస్తాం

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 300కు పైగా లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని, భాగస్వామ్య పార్టీలతో కలిపి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. సొంత మెజారిటీతో ప్రమేయం లేకుండా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొత్త భాగస్వామ్య పార్టీలను స్వాగతిస్తామని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయంతో ప్రధాని మోదీతో కలిసి మీడియా సమావేశంలో అమిత్‌షా పాల్గొన్నారు.

  '2014లో చారిత్రక తీర్పుతో మేము అధికారంలోకి వచ్చాం. 2019లోనూ పెద్ద మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తాం. తొలిసారిగా కాంగ్రెస్సేతర ప్రభుత్వం పెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చరిత్ర బీజేపీది. ఇప్పుడు ఎన్నికల ప్రచారం చివరి దశలో ఉన్నాం. బీజేపీ చరిత్రలోనే అత్యంత విస్తృత ప్రచారం జరిపాం' అని షా తెలిపారు. 

మీడియా ప్రశ్నలకు మోదీ చిరునవ్వులు చిందిస్తూ...'బీజేపీలో ప్రతీదీ పార్టీ అధ్యక్షుడే చూసుకుంటారు. ఆయనే సమాధానాలు ఇస్తారు' అని చెప్పారు. దీంతో అన్ని ప్రశ్నలకు అమిత్‌షానే సమాధానమిచ్చారు. ప్రజలు అంగీకరించిన ప్రధాని మోదీ అని, నరేంద్ర మోదీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందనే భరోసా తాను ఇస్తున్నానని అమిత్‌షా పేర్కొన్నారు. 

మరోసారి మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు బలంగా కోరుకున్నానని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటులో కొత్త పార్టీల సహకారం తీసుకుంటారా అని ప్రశ్నించినప్పుడు, తమ అజెండాకు అనుగుణంగా ఎవరు ముందుకొచ్చినా వారిని స్వాగతిస్తామని ఆయన సమాధానమిచ్చారు. సీట్ల విషయంలో విపక్ష కూటమిది పైచేయి అయ్యే అవకాశంపై అడిగినప్పుడు, కూటమికి చెందిన ఓ ఇద్దరు నేతలు ఢిల్లీలోని ఏసీ గదుల్లో కూర్చున్నంత మాత్రాన, వెట్టికార్మికుల్లా ప్రజలు వారిని అనుసరిస్తారని అనుకోరాదని చెప్పారు.

రాఫెల్‌పై చర్చకు మోదీ ముఖం చాటేస్తున్నారంటూ రాహుల్ గాంధీ పదేపదే చెబుతుండటంపై అడిగినప్పుడు, రాహల్ తన దగ్గరున్న ఆధారాలతో సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చని అమిత్‌షా హితవు చెప్పారు. రాఫెల్ డీల్‌ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని, ఆశ్రితపక్షపాతం మాటే లేదని ఆయన చెప్పారు. ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. 

దేశంలో మోదీ గాలి వీస్తోందని, తద్వారా ఆయన తిరిగి ప్రధాని అవడం ఖాయమని అమిత్‌షా చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ ఇండియాను శక్తివంతమైన దేశంగా గుర్తించాయని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీజేపీకి ఇవి అతి పెద్ద ఎన్నికలని చెప్పారు. ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని గట్టి నమ్మకం తనకుందని, పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటకలో సైతం మరిన్ని సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.