టీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయంగా బిజెపి

లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని,  టీఆర్‌ఎస్‌    వర్సెస్‌ బిజెపిగా రాజకీయ పరిస్థితి ఉంటుందని బిజెపి తెలంగాణ శాఖ అభిప్రాయపడింది. లోక్‌సభ ఫలితాల తర్వాత తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర కోర్‌కమిటీ సమావేశం జరిగింది.  తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కంటే బిజెపికి అధికంగా ఓటర్ల మద్దతు లభిస్తుందని, 25-30 శాతం ఓట్లు వస్తాయని కోర్‌కమిటీ అభిప్రాయపడింది. 

ఏడెనిమిది చోట్ల పార్టీ అభ్యర్థులు రెండోస్థానంలో నిలుస్తారని, కొన్ని స్థానాల్లో విజయం సాధిస్తారన్న ధీమాను సమావేశంలో బిజెపి నేతలు  వ్యక్తం చేశారు.  ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలతోపాటు అమిత్‌షా ర్యాలీ సందర్భంగా జరిగిన దాడిని ఖండిస్తూ కోర్‌కమిటీ తీర్మానం చేసింది.

దేశవ్యాప్తంగా తమ పార్టీకి 290 సీట్ల వరకు వస్తాయని, కేంద్రంలో ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వంలో తెరాస భాగస్వామి కాలేదని బిజెపి నేతలు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకదృష్టి పెడుతుందని, రాష్ట్రంలో పార్టీ సొంతంగా బలోపేతం కావాలన్నదే ఆలోచన అని, ఇక్కడ బిజెపికి  మంచి రోజులు రాబోతున్నాయని సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. 

 ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై గట్టి పోరాటం చేశామని, భవిష్యత్తులో ఇలాంటివి కొనసాగించాలని నిర్ణయించారు . తెలంగాణలో   టీఆర్‌ఎస్‌  కు   ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగేలా కార్యాచరణ రూపొందించాలని  చర్చించారు. సమావేశం అనంతరం రామచంద్రరావు, పేరాల శేఖర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్‌ పరీక్షల అంశంపై రాష్ట్రపతి కోవింద్‌ను, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను మూడురోజుల్లో కలుస్తామని చెప్పారు. 

కేసీఆర్  ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఇతర పార్టీలు లేవని, ఏపీలో ఓటమి భయంతో చంద్రబాబు యూపీయేతో కలిసి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.