10న భారత్ బంద్ కు కాంగ్రెస్ పిలుపు

ప్రజా సమస్యలపై ప్రజల వద్దకు వెళ్ళడం కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల బాట పడుతున్నది. ముఖ్యంగా వచ్చే సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఈ సంవత్సరం చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొన్ బాగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలకు నిరసనగా ఈ నెల 10న భారత్ బంద్ జరపాలని పార్టీ పిలుపిచ్చింది.

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని మేలుకొల్పడం కోసం ఈ పిలుపిస్తున్నట్లు పేర్కొంటూ, ఈ బంద్‌లో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కూడా పాల్గొనాలని కోరింది. పార్టీ అద్యక్షుడు రాహుల్ గాంధీ మానససరోవార్ యాత్ర కోసం వెళ్ళినప్పుడు ఈ పిలుపు ఇవ్వడం గమనార్హం.

పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగుతుండటం వల్ల సామాన్యుడు ఇబ్బందిపడుతున్నట్లు ఈ బంద్ ప్రకటన చేస్తూ కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జి రణదీప్ సుర్జీవాలా తెలిపారు. ఈ సందర్భంగా రూ.11 లక్షల కోట్ల ఇంధన దోపిడీని ప్రజలకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సయిజ్ డ్యూటీని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అధిక వ్యాట్‌ను తగ్గింఛి పెట్రోలియం ధరలను అదుపు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.