మమతా బెనర్జీపై ఈసీకి బిజెపి ఫిర్యాదు

ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంటున్న ఘర్షణపూరిత వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ  బిజెపి ఎన్నికల సంఘాన్ని కలిసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఫిర్యాదు చేసింది. కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జావడేకర్‌, ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, విజయ్‌ గోయల్‌లతో కూడిన బిజెపి నేతల బృందం.. ఈసీకి ఈ విషయంపై విజ్ఞాపన పత్రం సమర్పించింది. 

‘పశ్చిమ బెంగాల్‌లో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని నడిపించడంలో, శాంతి భద్రతలను పరిరక్షించడంలో విఫలమవుతున్నారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలైన ఈసీ, పీఎంవో వంటి వాటిని కూడా తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కించపర్చేలా మాట్లాడుతున్నారు. భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, రాజ్యాంగానికి ఈ తీరు చాలా ప్రమాదకరం’ అని వారు విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు.  

నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చేయాలని భాజపా నేతలు ఈ సందర్భంగా ఈసీని కోరారు. ఎన్నికల నేపథ్యంలో నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలను అరికట్టడంతో పాటు బలగాల పనితీరును పరిశీలించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కోరారు. చివరి దశ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు పలు చర్యలు తీసుకోవాలని కోరారు. 

‘తమ బలగాల మోహరింపు విషయాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించడంతో పాటు కేంద్ర హోం శాఖ ఇచ్చిన మార్గదర్శకాలను వారు కచ్చితంగా పాటించేలా చేసేందుకు కేంద్ర సాయుధ భద్రతా బలగాలకు చెందిన అధికారులను ప్రత్యేకంగా నియమించాలి’ అని కోరారు. కాగా, చివరి దశలో భాగంగా మే 19న పశ్చిమ బెంగాల్‌లో 9 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.