కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల ఏరివేత చేపట్టారు. పుల్వామాలో గురువారం ఎన్‌కౌంటర్ జరిపి ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాసిబ్బంది మట్టుబెట్టారు. కాగా, ఎదురుకాల్పుల్లో ఓ జవాను అమరులయ్యారు.

ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం పుల్వామాలోని దలిపొరా గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్పీఎఫ్‌, రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ బలగాలు సంయుక్తంగా గ్రామంలో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. భద్రతాసిబ్బంది సోదాలు జరుపుతుండగా ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు వారిపై కాల్పులు జరిపారు.

దీంతో ఎదురుకాల్పులు జరిపిన సిబ్బంది ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. మరికొందరు ముష్కరులు అక్కడి నుంచి పారిపోగా వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఘటనాస్థలంలో భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

కాగా.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు పుల్వామాలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.