శాసనసభ రద్దుపై ప్రతిపక్షాల మండిపాటు

ముందస్తు ఎన్నికల కోసం తొమ్మిది నెలల ముందుగానే శాసనసభను రద్దు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముందుగానే కెసిఆర్ పాలనను తిరస్కరించే అవకాశం ప్రజలకు వచ్చినదని మరోవంక సంబర పడుతున్నాయి.

ఈ విధంగా చేయడం అప్రజాస్వామికమని కేంద్ర మాజీమంత్రి, బిజెపి సీనియర్‌ నేత దత్తాత్రేయ విమర్శించారు. ఐదేళ్ల పాటు పాలించాలని ప్రజలు తీర్పు ఇస్తే నాలుగేళ్లకే ఎందుకు రద్దు చేశారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రివర్గం అభిప్రాయాలను కూడా కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏవీ పూర్తి చేయలేదని ఎద్దేవాచేశారు. మిషన్‌ భగీరథ పూర్తి చేశాకే ఓట్లు అడుగుతానని కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు.

అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. పోయే కాలమొచ్చి కేసీఆర్‌ శాసన సభను రద్దు చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల పేరుతో మోసం చేస్తున్నారని విమర్శించారు.  తొమ్మిది నెలల ముందుగా ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. 

కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలన అబద్ధాలు, మోసాలతో నిండిపోయిందని దయ్యబట్టారు.  అధికారం నుంచి దిగిపోతున్నప్పుడు కూడా కేసీఆర్‌ అబద్ధాలు చెప్పడాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఆర్థికంగా తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్తున్న కేసీఆర్‌ మాటలు వంద శాతం అబద్ధమని స్పష్టం చేసారు. లిక్కర్‌ అమ్మాకాల్లో, రైతు ఆత్మహత్యల్లో, అప్పుల్లో తెలంగాణను కేసీఆర్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారని ధ్వజమెత్తారు.

నేడు ప్రజావ్యతిరేక పాలనకు విముక్తి కలిగిన రోజు అని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు డా. కె లక్ష్మణ్‌ చెప్పారు ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తోందో ప్రజలకు కేసీఆర్‌ స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపి ఇప్పుడు ఎందుకు ముందస్తుకు వెళ్తున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలను అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. .

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని బిజెపి నేత జి. కిషన్‌ రెడ్డి కేసీఆర్‌ను నిలదీశారు. ఎంఐఎంతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎంకు చెందిన ప్రైవేట్‌ వైద్య కళాశాలకు భూమి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఎంఐఎం మిత్రపక్షమైతే బహిరంగంగా ఎన్నికల పొత్తు కుదుర్చుకోవాలని సవాల్ చేసారు.  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారని, తెలంగాణలో బిజెపి ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకొస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

ముందస్తు దస్తు ఎన్నికలకు శంఖారావం పూరించిన కెసిఆర్ కు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని తెలంగాణ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేసారు. గడచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో కేసీఆర్ గడీ పాలనను చూపారన్న ఆయన అందరు సీఎంలూ సచివాలయం సాక్షిగా పాలన సాగిస్తే,  కేసీఆర్ మాత్రం సచివాలయానికి వెళ్లటమే మహా పాపం అన్నట్టుగా ప్రగతి భవన్ నుంచి పాలన సాగించారని ఆరోపించారు. 2019లో టిడిపి మద్దతుతోనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేసారు.

తొమ్మిది నెలల పదవీకాలాన్ని నెలలు త్యాగం చేశా అంటున్న కెసిఆర్ ఎవరి కోసం త్యాగం చేశారంటూ కాంగ్రెస్‌ నాయకురాలు డీకే అరుణ ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెబుతూ మోసగిస్తున్నారని, కేసీఆరే తెలంగాణకు పెద్ద బఫూన్‌ అని విమర్శించారు. సర్వేల్లో 100 సీట్లు వస్తాయని కేసీఆర్‌ చెబుతున్నారని, 100 సీట్లు వచ్చేటప్పుడు ముందస్తు ఎన్నికలు ఎందుకు అని ప్రశ్నించారు. బీజేపీతో కేసీఆర్‌ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు.

రాబోయే ఎన్నికలు సరియైన సమయంలో జరిగితే టీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదని కేసీఆర్‌కు భయమేస్తుందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాహుల్‌ గాంధీని తిట్టడం, కాంగ్రెస్‌ను ఆడిపోసుకోవడంతో హామీల ప్రస్తావన నుంచి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ముందస్తు ఎన్నికల వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేసారు.