మెజారిటీ మార్క్‌ దాటేశాం. అమిత్‌ షా భరోసా

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ఆరు దశల్లో పోలింగ్‌ ముగిసిందని.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ‌ మార్క్‌ను బిజెపి దాటేసిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా భరోసా  వ్యక్తం చేశారు. 

‘సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలుస్తారని మీరు (మీడియా) నన్ను పదేపదే అడుగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను దేశమంతా పర్యటించాను. ప్రచార సమయంలో ప్రజల స్పందనను ప్రత్యక్షంగా చూశాను. వారి స్పందనను చూసి ఐదు, ఆరు దశల పోలింగ్ పూర్తయిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ మార్క్‌ని దాటేశామనే ధీమా మాలో కలిగింది" అని చెప్పారు. 

కాగా, ఏడో దశ పోలింగ్‌ పూర్తి అయన తర్వాత మొత్తంగా 300పైగా స్థానాల్లో గెలుస్తామని అమిత్ షా ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీయే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

మే 19న చివరి దశ పోలింగ్‌ జరగనుంది. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ లేదా కూటమి కనీసం 272 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ 2014లో కేవలం 44 స్థానాల్లో మాత్రమే గెలిచింది. లోక్‌సభలో ప్రతిపక్ష హోదాకు కావాల్సిన కనీస స్థానాలను సైతం కాంగ్రెస్‌ గెలుచుకోలేకపోయింది.