మమతా బెనర్టీని అరెస్ట్‌ చేయండి.. కన్నా డిమాండ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాపై జరిగిన దాడికి నిరసనగా దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు. అమిత్‌ షాపై రాళ్ల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. మమత బెనర్జీ హింసద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నారని, దేశంలో ప్రజాస్వామ్యాం ఉందా అనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. 

పశ్చిమ బెంగాల్‌లో అమిత్‌ షా చేపట్టిన ర్యాలీపై తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడికి నిరసనగా విజయవాడలో బీజేపీ నేతలు, కార్యకర్తలు బుధవారం నిరసన చేపట్టారు. డౌన్‌ డౌన్‌ మమతా బెనర్జీ అంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాలో బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో పాటు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అమిత్‌ షాపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.  

వెంటనే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోని, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్‌ చేయాలని కన్నా డిమాండ్‌ చేశారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాగానే రాష్ట్రాలు వారి జాగీరుగా భావిస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాంలో ఇది మంచి పరిణామం కాదని ధ్వజమెత్తారు. 

మమతా బెనర్జీ హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తోందని, వెంటనే ఆమెపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని కన్నా డిమాండ్‌ చేశారు. మమతా బెనర్జీని సమర్ధిస్తున్న చంద్రబాబు నాయుడిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మోదీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు రాజకీయ దొంగలంతా ఏకమయ్యారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఎన్నికుట్రలకు పాల్పడినా ప్రజలు బీజేపీకే పట్టం కట్టనున్నారని వ్యాఖ్యానించారు.  

బీజేపీపై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని, అయినా ప్రజలు బీజేపీకే మద్దతు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాబోతుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.