అదృష్టంతోనే దాడి నుండి తప్పించుకున్నా : అమిత్ షా

కోల్‌కతాలో హింసాకాడం చెలరేగిన సమయంలో సీఆర్‌పీఎఫ్ కనుక అక్కడ లేకుండా ఉంటే దాడి నుంచి తాను తప్పించుకోవడం కష్టమయ్యేదని, బీజేపీ కార్యకర్తలను చితక్కొట్టారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. టీఎంసీ ఎంత వరకైనా వెళ్తుందని, దాడి నుంచి తాను అదృష్టం వల్లే తప్పించుకోగలిగానని అమిత్‌షా చెప్పారు. 

తన రోడ్‌షోకు ముందు బీజేపీ బ్యానర్లు తొలిగిస్తుంటే పోలీసులు మౌనప్రేక్షకులుగా మిగిలిపోయాయని, ప్రధాని పోస్టర్లు, తన పోస్టర్లు చింపేసినప్పటికీ బీజేపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని అమిత్‌షా తెలిపారు.    

'ఇది (హింసాకాండ) మా పనేనని మమతా బెనర్జీ చెబుతున్నారు. ఆమెకు నేను చెప్పదలచుకున్నది ఒకటే. టీఎంసీ పశ్చిమబెంగాల్‌లో కేవలం 42 సీట్లలోనే పోటీ చేస్తోంది. మేము దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ పోటీ చేస్తున్నాం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ హింస చెలరేగలేదు. ఒక్క పశ్చమబెంగాల్‌లోనే జరిగింది. దీనికి టీఎంసీదే బాధ్యత' అని అమిత్‌షా స్పష్టం చేశారు. 

‘బంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు మమతాబెనర్జీదే బాధ్యత. రాష్ట్రంలో తృణమూల్‌ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. అక్రమంగా పోలింగ్‌ బూత్‌ల్లోకి చొరబడి దుశ్చర్యలకు దిగుతున్నారు' అని బిజెపి అధ్యక్షడు దుయ్యబట్టారు. ఈ దాడులకు తృణమూల్‌ కాంగ్రెసే బాధ్యత వహించాలని అమిత్ షా స్పష్టం చేశారు. 

 హింసాకాండకు బీజేపీదే బాధ్యతంటూ టీఎంసీ చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. ఆరు విడతల ప్రచారంలో ఒక్క పశ్చిమబెంగాల్‌లో మినహా ఎక్కడా హింస చెలరేగలేదని ఆయన గుర్తుచేశారు.