కాంగ్రెస్ - టీడీపీ పొత్తు జుగుప్సాకరం

కాంగ్రెస్ - టీడీపీ పొత్తు అసహ్యకరం, జుగుప్సాకరం అని తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎద్దేవా చేసారు. తెలంగాణలో రెండు పార్టీలు పొత్తుకు దిగే ప్రయత్నాలను ప్రస్తావిస్తూ పొద్దున లేస్తే తెలంగాణపై కుట్రలు చేసే చంద్రబాబుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎట్ల కలుస్తారు అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ మళ్లీ ఆంధ్రా పార్టీలకు గులాం కావొద్దని హెచ్చరించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కుడా కెసిఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  రాష్ర్టానికి కాంగ్రెస్ పీడ విరగడవ్వాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాహుల్ గురించి మాట్లాడుతూ దేశంలోనే ఆయనో పెద్ద బఫూన్ అని అవహేళన చేసారు. రాహుల్‌గాంధీ ఏంటో అందరికీ తెలుసని చెబుతూ లోక్‌సభలో నరేంద్ర మోదీ దగ్గరకు వెళ్లి ఆయనను హత్తుకోవడం, కన్ను కొట్టడం దేశమంతా చూసింది అని పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలో రాహుల్ ప్రచారం గురించి స్పందిస్తూ “రాహుల్ మాకు పెద్ద ఆస్తి. ఆయన తెలంగాణలో ఎంత ఎక్కువగా పర్యటిస్తే.. అన్ని ఎక్కువ సీట్లు మేం గెలుస్తాం” అని భరోసా వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రజలు ఢిల్లీకి గులాంలుగా మారొద్దని ఈ సందర్భంగా హితవు చెప్పారు. తెలంగాణ నిర్ణయాలను తెలంగాణలోనే తీసుకోవాలని స్పష్టం చేసారు.

తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని 2001లోనే చెప్పానని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణకు పెద్ద దరిద్రం కాంగ్రెస్సే అని పేర్కొంటూ కాంగ్రెస్ తెలంగాణను భిక్షమెయ్యలేదని, తెగించి కొట్లాడి తెచ్చుకున్నామని తెలిపారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ధ్వంసం చేసింది. రైతులను మోసం చేసిందని అంటూ అన్ని దరిద్రాలకు రిజర్వ్ బ్యాంకు కాంగ్రెస్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాశనం చేసిన తెలంగాణను విడిపించిన భూమిపుత్రుడు కేసీఆర్ అని సగర్వంగా చెప్పుకున్నారు. స్వరాష్ట్రంలో కల్తీలు లేవని, కుంభకోణాలు లేవని చెప్పుకొచ్చారు. బాధ్యతారాహిత్యంగా ఎన్నికల హామీలు ఇస్తున్నదని విరుచుకు పడ్డారు. టీఆర్‌ఎస్ వల్లే కాంగ్రెస్ రూ. 2 వేల పెన్షన్ ప్రకటించే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ తెలిపారు.