అవినీతిపై బహిరంగ చర్చకు ప్రధాని సవాల్

అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్రమోదీ సవాల్ చేశారు. తాను ఇన్నాళ్లూ నిబద్ధతతో పనిచేశానని ఎక్కడా అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని ఉత్తరప్రదేశ్‌లోని బాలియా ఎన్నికల సభలో ప్రకటించారు. తనపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నేతలు దుమ్ముంటే అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని ప్రధాని సవాల్ చేశారు. 

ఆస్తులు కూడబెట్టినట్టు లేదా విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్నట్టు రుజువుచేయాలని నిలదీసేరు. లోక్‌సభ ఆఖరి విడత ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలపై విమర్శల దాడి పెంచారు. మహాకూటమి నాయకులు తనపై ఆరోపణలు చేస్తున్నారని, తనకు ఎక్కడైనా బినామీ ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు, బంగళాలు లేదా షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నట్టు నిరూపించాలని మరోసారి సవాల్ చేశారు. 

 "నేను మహాకల్తీ కూటమికి బహిరంగ సవాలు విసురుతున్నాను. వారికి దమ్ముంటే నన్ను దూషించడానికి బదులు.. నా సవాల్ స్వీకరించాలి. నేనేమైనా బినామీ ఆస్తులను కూడబెట్టి ఉంటే.. ఫార్మ్‌హౌజ్, భవనం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఉంటే.. విదేశీ బ్యాంకులో డబ్బు దాచుకొని ఉంటే లేదా లక్షలు, కోట్లు విలువ చేసే వాహనాలను కొని ఉంటే రుజువు చేయాలి అని"అని స్పష్టం చేశారు.   

ఇన్నాళ్లూ రాజకీయాల్లో నిబద్ధతతో పనిచేశానన్న ప్రధాని ‘ విదేశాల్లో ఆస్తులు కూడబెట్టడం లేదా లక్షలు, కోట్ల రూపాయల విలువైన వాహనాలు లేవు’అని స్పష్టం చేశారు. మాతృభూమికి నిబద్ధతతో సేవ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పేదల సంక్షేమం కోసమే తాను అహర్నిషలు పాటుపడుతున్నట్టు అదే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు మోదీ తెలిపారు.