నిధుల్లేక ఆగిపోయిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణాలకు నిధుల్లేక ఆగిపోయాయి. ఇప్పటికే పూర్తిచేసిన ఇండ్ల నిర్మాణాలకూ బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు. దీంతో ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే నెల నుంచి పనులు పూర్తిగా నిలిచిపోయే అవకాశముంది. 

2019 చివరి నాటికి పూర్తి చేస్తామనుకున్న ఇండ్ల నిర్మాణాలు మరో ఏడాదైనా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అందుకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ ఖజానా ఖాళీ కావడమే కారణం. బల్దియాలో చేపట్టిన పనులకుగాను కాంట్రాక్టర్లకు సుమారు రూ.1000 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అధికార వర్గాల అంచనా.

రాష్ట్రంలో రూ.20వేల కోట్లతో 2,80,616 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్‌ రుణాల ద్వారా సేకరించాల్సి ఉంది. అందులో భాగంగానే రూ.5,490.57 కోట్లు రుణం తీసుకుని ఇప్పటి వరకు జరిగిన పనులకు బిల్లులు చెల్లించారు. దీంట్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న లక్ష ఇండ్ల కోసం రూ.3,230 కోట్లు బల్దియాకే ఇచ్చారు. మిగిలిన జిల్లాల్లో చేపట్టిన 1,80,616 ఇండ్ల కోసం రూ.2,260.57 కోట్లు విడుదల చేశారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో 117 ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో ఇన్‌సిటూ (పాత ఇండ్లను కూల్చేసి కొత్తగా నిర్మించడం) 49 ప్రాంతాల్లో 9,828 ఇండ్లు, ఖాళీ స్థలాల్లో 68 ప్రాంతాల్లో 90,172 ఇండ్ల నిర్మాణానికి పనులు సాగుతున్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో 40 ప్రాంతాల్లో ఇన్‌సిటూ (పాత ఇండ్లను కూల్చేసి కొత్తగా నిర్మించడం)లో 8,288 ఇండ్లు, నాలుగు ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో 1595 ఇండ్లను కొత్తగా నిర్మిస్తున్నారు. 

రంగారెడ్డి జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ఇన్‌సిటూ కింద 69,226 ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో 22,832 ఇండ్లు, మేడ్చల్‌ జిల్లాలో ఇన్‌సిటూ కింద నాలుగు ప్రాంతాల్లో 44,427 ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో 35,844 ఇండ్లు, సంగారెడ్డి జిల్లాలో 10 ప్రాంతాల్లో 28,220 ఇండ్లను నిర్మిస్తున్నారు.

బల్దియాలో లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన సుమారు రూ.9వేల కోట్లతో పూర్తి చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. లక్ష ఇండ్లలో ఇప్పటి వరకు 708 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు సర్కార్‌ రూ.3,230కోట్ల బిల్లులు చెల్లించింది. మరో రూ.650కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో రూ.500కోట్ల బిల్లులు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 

బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. రుణం ఇస్తేనే... డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు పూర్తి కావాలంటే రుణమే దిక్కయ్యింది. రూ.20వేల కోట్లలో హడ్కో నుంచి రూ.5,490 కోట్ల రుణం తీసుకుని పాత బిల్లులకే సరిపెట్టారు. పెండింగ్‌ బిల్లులు, ప్రస్తుతం జరుగుతున్న పనులు పూర్తి కావాలంటే మరిన్ని నిధులు కావాలి. 

అయితే, రుణం మంజూరు కావాలన్నా కనీసం ఏడాది పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అప్పటి వరకు పనులు చేయాలా? వద్దా? చేస్తే బిల్లులు వస్తాయా? చేయకపోతే యంత్రాలు, యంత్ర సామాగ్రి పరిస్థితేంటి? అని కాంట్రాక్టర్ల ఆందోళన చెందుతున్నారు.