హైదరాబాద్ నగరంలో ప్రశాంతంగా ఉన్న అంబర్పేటలో ఎంఐఎం పార్టీ అశాంతిని సృష్టించిందని బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అంబర్పేటలో నెలకొన్న పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ.. పోలీసులు అకారణంగా యువకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్కడ లేని మసీదు ఉందని ఎంఐఎం నేతలు అలజడులు రేపుతున్నారని ధ్వజమెత్తారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగాగా ఉన్నప్పుడే ఆ వివాదాస్పద స్థలాన్ని ప్రభుత్వం స్థల యజమానులకు డబ్బు చెల్లించి స్వాధీనం చేసుకున్నారని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎవరికీ ఇబ్బంది జరగకుండా స్థలం కోల్పోయిన వాళ్ళకందరికి మార్కెట్ రేటు కంటే ఎక్కువ పారితోషకం ఇచ్చామని తెలిపారు. జీహెచ్ఎంసీ దగ్గర డబ్బులు తక్కువ ఉండటంతో దశలవారిగా నష్టపరిహారం ఇచ్చామని చెప్పారు.
మొత్తం 280 మందికి గాను ఇప్పటివరకు 170 మందికి నష్టపరిహారం చెల్లించామని వివాదాస్పద స్థల యజమానులుకు కూడా నష్టపరిహారం చెల్లించామని వివరించారు. మొత్తం రూ 2.5 కోట్లు ఏడాది క్రితం ఆ స్థల యజమానులకు ప్రభుత్వం ఇచ్చిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.