ఉద్రిక్తంగా అగ్రవర్ణాల భారత్ బంద్

ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టానికి వ్యతిరేకంగా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అగ్రవర్ణాలు భారత్ బంద్ చేపట్టాయి. అగ్రకులాలకు చెందిన దాదాపు 35 సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయి. దీంతో పరిస్థితి అదుపుతప్పుకుండా చూసేందుకు పలు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌ జిల్లాల్లో సెక్షన్ 144 విధించారు. పలు జిల్లాల్లో షాపులు, మార్కెట్లు మూతపడ్డాయి.

ఎస్సీ, ఎస్టీలకు రక్షణగా నిలిచే ఈ చట్టాన్ని పటిష్టం చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించడంపై అగ్రకులాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాట్నాలోని బీజేపీ ప్రధానకార్యాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి. దీంతో వారిని చెదరగొట్టేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. గ్వాలియర్ తదితర ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో కూడా ఆందోళనలు కొనసాగాయి. రోడ్లపై టైర్లకు నిప్పుపెట్టి ఆందోళనకారులు నిరసన తెలుపుతున్నారు. రాష్ట్ర రాజధాని జైపూర్‌లో స్కూళ్లు, మాల్స్ మూసేశారు. కాగా సమతా ఆందోళన్ నేత యోగేంద్ర రాథోడ్ మాట్లాడుతూ. ‘‘రిజర్వుడు కులాలకు చెందిన 131 మంది పార్లమెంటు సభ్యులు దేశాన్ని చెరబట్టారు’’ అని పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఆందోళనలు బీజేపీ కుట్రలో భాగమేనని ఎన్నికల నేపథ్యంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ది పొందేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత దీపక్ బబారియా ఆరోపించారు. ‘‘హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెట్టినట్టే ఎస్సీ,ఎస్టీ కులాలు, ఇతర కులాల మధ్య కూడా విభేదాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అవినీతి, రైతుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ గిమ్మిక్కులు ప్రయోగిస్తున్నారు’’ అని ఆయన ఆరోపించారు.