ఏనుగు బరువుకు సైకిల్‌ పంక్చర్‌

కాంగ్రెస్‌ కేవలం బిజెపి ఆధిక్యాన్ని తగ్గించడానికి మాత్రమే ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తోందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ విమర్శించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల పార్టీ చిరవకు ఈ స్థాయికి దిగజారిందని దయ్యబట్టారు. ‘‘ఈ ఎన్నికల్లో బిజెపి ఓట్ల శాతాన్ని తగ్గించడానికే పోటీ చేస్తున్నామని కాంగ్రెస్ యువరాణి (ప్రియాంకగాంధీ) అంటున్నారు. నిజంగా ఇది విచారించాల్సిన విషయం. కాంగ్రెస్ చివరకు ప్రత్యర్థి పార్టీల ఓట్ల శాతాన్ని తగ్గించే పార్టీగా మారింది’’ అని ఆదిత్యనాథ్‌ ఎద్దేవా చేశారు. 

గోరఖ్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్న బిజెపి  అభ్యర్థి ప్రముఖ నటుడు రవికిషన్‌కి మద్దతుగా ప్రచారం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎన్నోసార్లు అవమానించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. 

భగవాన్‌ రాముడు, కృష్ణుడు ఉన్నట్లు ఎక్కడా లేదని గతంలో కాంగ్రెస్‌ వారు సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారని.. మరి అలా అయితే ఆలయాల్ని సందర్శించినప్పుడు రాహుల్‌ గాంధీ ఎవర్ని పూజిస్తున్నారని ప్రశ్నించారు.  

ఈ సందర్భంగా ఆదిత్యనాథ్‌ ఎస్పీ-బీఎస్పీ కూటమి పైనా విరుచుకుపడ్డారు. ఏనుగు బరువుతో సైకిల్‌ పంక్చర్‌ అవ్వడం ఖాయమని పరోక్షంగా ఎస్పీ, బీఎస్పీని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. 

కుంభమేళా సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల పాదాలను ప్రధాని కడగడాన్ని ఆయన పురాణాల్లో కృష్ణుడు.. సుధామా కాళ్లని శుభ్రం చేయడంతో పోల్చారు. కేవలం చివరి దశ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆదిత్యనాథ్‌ ఆయా నియోజకర్గాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు.