కాబినెట్ భేటీపై బాబు అనుకొన్నదొక్కటి.. జరిగింది మరొకటి !

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో  ఉన్న సమయంలో పంతానికి పోయి పట్టుబట్టి మరి కాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్నదొక్కటి, జరిగింది మరొక్కటి అని తెలుస్తున్నది.  ప్రస్తుతం ఎన్నికల కమీషన్ అనుమతి ఇచ్చిన విధంగా . కరువు, ఫొని తుఫాన్, తాగునీరు, ఉపాధిహామీ అంశాలపై చర్చించడం కోసం ఆయన కాబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని అనుకోలేదు. 

ముందుగా అజెండాను ఎన్నికల కమీషన్ కు పంపి, అనుమతి పొందాలని, అందుకు 48 గంటల వ్యవధి ఇవ్వాలని సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం మెలిక పెట్టడంతో ఈ అంశాలను తెరపైకి తెచ్చారు. అయితే వాస్తవానికి రెండు అంశాల గురించి  ముఖ్యమంత్రి కాబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు తెలుస్తున్నది. 

మొదటగా, బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఎస్ ను నిలదీయాలని అనుకున్నారు. మరొక అంశం పోలవరం కాంట్రాక్టర్ కు రూ 2,000 కోట్లు అడ్వాన్స్ గా ఇవ్వాలని అనుకున్నారు. మరో కొన్ని పెండింగు లో ఉన్న బిల్లులు చెల్లించాలి అనుకున్నారు. 23న ఎన్నికల ఫలితాల తర్వాత ఎవ్వరు అధికారంలో ఉంటారో తెలియదు కాబట్టి కొన్ని పనులు సరిచేయాలి అనుకున్నారు. 

అయితే ఇప్పుడు  అజెండాలోని అంశాలపై మాత్రమే చర్చించాలని ఈసీ స్పష్టం చేసింది. పెండింగ్ చెల్లింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సూచించింది. పైగా, కొత్త నిర్ణయాలకు, రేట్ల మార్పుకు, బకాయిల చెల్లింపులకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఈసీ అనుమతి తర్వాత అమలు చేయాలని పేర్కొంది. అంతేకాకుండా కేబినెట్‌ నిర్ణయాలపై ఎలాంటి మీడియా సమావేశం ఏర్పాటు చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దానితో ముఖ్యమంత్రికి మింగుడు పడటం లేదు.