దేశంలోని ప్రతి ఇంటి నుంచీ మోదీ గాలి

దేశంలోని ప్రతి ఇంటి నుంచీ మోదీ గాలి వీస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. పరిస్థితి పూర్తిగా తమకు అనుకూలంగా ఉంటే దీనికి భిన్నంగా కథనాలు వెలువడుతున్నాయని ఆయన విమర్శించారు. `ఢిల్లీలో కూర్చుని కొందరు పండితులు వార్తలు వండి వారుస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల నాటి పరిస్థితులు లేవని, మోదీ గాలి తగ్గిందని నివేదికలు వదులుతున్నారు’ అని ప్రధాని ధ్వజమెత్తారు. ప్రతి ఇంటి నుంచీ మోదీ గాలి బలంగా వీస్తోందని ఆయన స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో సోమవారం ఆయన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ గతంలోకంటే ఓటింగ్ శాతం బాగా పెరిగిందని, ఈ పరిణామం పండిట్లను కలవర పెడుతోందని తెలిపారు. రెండు రకాలైన ప్రజలు రికార్డులు సృష్టిస్తారన్న సంగతి పాపం ఢిల్లీ రాజకీయ పండితులు తెలియదని ఆయన పేర్కొన్నారు. ‘యుక్తవయస్కులైన నా స్నేహితులు తొలి ఓటు నాకే వేశారు.. వేస్తారు. అలాగే అమ్మలు, సోదరీమణుల ఓట్లూ నాకే పడతాయి’ అని ప్రధాని ధీమాగా చెప్పారు.

 ‘తల్లులు, సోదరీమణులు నాకే ఓటేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు’ అని మోదీ స్పష్టం చేశారు. ఉచిత వంట గ్యాస్, విద్యుత్‌ను అందచేసినందుకు మహిళలందరూ బీజేపీకే మద్దతు ఇస్తారని ఆయన తెలిపారు. అమ్మలు, అక్కచెల్లెళ్లు పోలింగ్ బూత్‌లకు ఎందుకు అంత భారీగా వస్తున్నారో ‘పండిట్లు’ అంచనావేయలేకపోతున్నారని ప్రధాని ఎద్దేవా చేశారు. ప్రతి ఇంటి నుంచీ మోదీ గాలి వీస్తోందని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంపిట్రోడాపై మోదీ నిప్పులు చెరిగారు. 1984 నాటి సిక్కుల ఊచకోత ఘటనలో వేలాది మంది చనిపోగా, దాన్ని పిట్రోడా తక్కువ చేసిన మాట్లాడడం ప్రధాని ఎద్దేవా చేశారు. జరిగిందేదో జరిగింది... అయితే ఏమిటని కాంగ్రెస్ నేత చేసిన అహంకారపూరితం, బాధ్యతారాహిత్యంగా మోదీ అభివర్ణించారు. కామన్‌వెల్త్ గేమ్స్, 2జీ స్పెక్ట్రం, బొగ్గు బ్లాక్‌ల వేలంలో కుంభకోణాలు ఎవరి హయాంలో జరిగాయి? అని ప్రధాని నిలదీశారు. 

రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఏంటి అంటున్నారని మోదీ విమర్శించారు. దివంగత రాజీవ్‌గాంధీ ఐఎన్‌ఎస్ విరాట్‌ను పిక్నిక్‌కోసం వాడుకున్నారని గతంలో చేసిన వ్యాఖ్యలను మోదీ సమర్థించుకున్నారు. ఐఎన్‌ఎస్ యుద్ధనౌకలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన లెఫ్టినెంట్ కమాండర్ ధర్మేంద్ర సింగ్ చౌహాన్ రత్లాంకు చెందినవారేనని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశంకోసం చౌహాన్‌తోపాటు ఎందరో త్యాగాలు చేస్తుండగా ఓ కుటుంబం మాత్రం యుద్ధనౌకను విహార యాత్రలకు వాడుకుందని మోదీ విమర్శించారు.

దేశ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా.. అయితే ఏమిటని సిగ్గులేకుండా వ్యాఖ్యానిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. పేదలు పక్కా ఇళ్లు, ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాలు అమలు చేసినట్టు మోదీ పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ పథకం అమల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఆ పథకం ఏమైందో భగవంతుడిగే తెలియాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భగవంతుణ్నీ దగా చేసిందని మోదీ తీవ్ర విమర్శ చేశారు. 

`భారత్ మాతాకీ జై’ నినాదంపై కాంగ్రెస్ అభ్యంతరాలు చెబుతోందని ఆయన దుయ్యబట్టారు. భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నదీ దిగ్విజయ్ సంఘటన ఉదాహరణగా ఆయన చెప్పారు. ‘దేశ ప్రజలందరూ, రాష్టప్రతి, నేను, మా పార్టీ నేతలందరూ ఓటింగ్‌లో పాల్గొన్నాం’ అని ప్రధాని స్పష్టం చేశారు.