రక్షణ ఒప్పందాలు కాంగ్రెస్‌ ఏటీఎంలు

కాంగ్రెస్‌ హయాంలో రక్షణ ఒప్పందాల్లో చోటుచేసుకున్న అవినీతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రక్షణ ఒప్పందాలు ఆలస్యం కావడంపై విరుచుకుపడ్డారు.  కాంగ్రెస్ పార్టీ వాటిని డబ్బు అందించే యంత్రాలుగా భావించిందని ధ్వజమెత్తారు.

‘భారత దేశ రక్షణ అవసరాలు 70 శాతం దిగుమతుల వల్లే తీరుతున్నాయి. ఈ ఒప్పందాలు కాంగ్రెస్‌కు ఏటీఎంలుగా మారాయి’ అని మోదీ విమర్శించారు. భద్రతాబలగాలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించడానికి కాంగ్రెస్‌ సుమారు ఆరు సంవత్సరాలు జాప్యం చేసింది. కాంగ్రెస్‌, దాని ‘మహామిలావత్’ స్నేహితులు ముఖ్యమైన నిర్ణయాలను అమలు చేయడంలో  ఆలస్యం చేశాయి. దాని వల్ల దేశం తీవ్రమైన నష్టాన్ని భరించాల్సి వచ్చింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా శామ్ పిట్రోడా వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘తమ పూర్వీకుల పేరు మీద వారు ఓట్లు అడుగుతున్నారు. కానీ వారి పెద్దలు చేసిన తప్పులు గురించి అడిగితే మాత్రం జరిగిందేదో జరిగిపోయిందని సమాధానమిస్తారు’ అని విమర్శించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ హాయాంలో సాధించిన వృద్ధి రేటును కొనసాగించలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమన్నారు.