అమెరికా-భారత్ మధ్య కీలక ఒప్పందం

భారతదేశం, అమెరికా సంబంధాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య మొదటిసారి 2+2 చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైఖేల్ ఆర్ పొంపియో, డిఫెన్స్ సెక్రటరీ జేమ్స్ మటిస్ పాల్గొన్నారు.

అత్యంత కీలకమైన సైనిక, భద్రత సహకారానికి సంబంధించిన కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్‌పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం రక్షణ రంగంలో అత్యంత సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత సైన్యానికి అమెరికా అందజేస్తుంది. ఇరు దేశాల మధ్య హాట్‌లైన్ ఏర్పాటుకు కూడా అంగీకారం కుదిరింది.

చర్చల అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్‌ను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికాకు ప్రధాన రక్షణ భాగస్వామి (ఎండీపీ) హోదాను భారతదేశానికి ఇవ్వడం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమని ఈ చర్చల్లో మరోసారి స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

ఈ నలుగురు నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ ప్రారంభ చర్చల ఎజెండాపై సంతృప్తి వ్యక్తం చేశారు. సరిహద్దుల ఆవలి నుంచి వస్తున్న ఉగ్రవాదం గురించి చర్చించినట్లు తెలిపారు. ఉగ్రవాదులను లష్కరే తొయిబాలో భాగమని ఇటీవల అమెరికా పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్‌లో వృద్ధి చెందుతున్న ఉగ్రవాదం ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు తెలిపారు. ఈ ఉగ్రవాదం భారతదేశం, అమెరికాలతోపాటు యావత్తు ప్రపంచంపై సమానంగా ప్రభావితం చేస్తోందన్నారు.

రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ 2019లో భారతదేశ తూర్పు తీరంలో త్రివిధ దళాల విన్యాసాలను భారతదేశం-అమెరికా సంయుక్తంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇటువంటి విన్యాసాలు జరగడం ఇదే తొలిసారి అని తెలిపారు.