ఎన్నికల ఫలితాలకు ముందే ప్రతిపక్షాల్లో లుకలుకలు

ఎన్నికల ఫలితాలకు ముందే ప్రతిపక్షాలలో లుకలుకలు బహిర్గతం అవుతున్నాయి. తుదిదశ పోలింగ్ పూర్తి కాగానే  ఈ నెల 21న ఢిల్లీలో ప్రతిపక్ష నేతల సమావేశం ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు నిర్ణయించడం తెలిసిందే. ప్రతిపక్షాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే ముందుగా ఒక వ్యూహం ఏర్పాటు చేసుకోవాలని, అతి పెద్ద పార్టీగా బిజెపి కొనసాగినా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకుండా రాష్ట్రపతిని కోరాలని భావిస్తున్నారు. 

అయితే ఈ సమావేశానికి పలువురు ప్రతిపక్ష నేతలు గైరాజరు అయ్యే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా ముగ్గురు కీలక నాయకులు సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని ఇప్పటికే సంకేతం ఇచ్చిన్నట్లు చెబుతున్నారు. మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌ ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నట్లు వెల్లడైంది. 

గత వారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  కోల్‌కతా వెళ్లి మమతను కలిసిన సందర్భంగా మమతా తన వ్యతిరేకతను వెల్లడించినట్లు చెబుతున్నారు. ఫలితాలు రాకుండా సమావేశం ఎందుకని ప్రశ్నించినట్లు కూడా తెలిసింది.  మాయావతి, అఖిలేశ్‌ కూడా ఈ సమావేశంపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

ఒకవేళ ప్రతిపక్షాలకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలొస్తే ప్రధానిగా ఎవరు ఉండాలన్న అంశంపై స్పష్టత లేకపోవడమే  ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.  తాము ప్రధాని పదవి ఆశిస్తున్నామని బహిరంగపర్చకపోయినా మమత, మాయావతి, రాహుల్‌ ఈ రేసులో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు వారి పార్టీ నేతలు పలు సందర్భాల్లో తమ నేత ప్రధాని పదవికి అన్ని విధాలా అర్హులని వ్యాఖ్యలు చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. 

మరోవంక,  మాయావతి కాంగ్రెస్‌పై ఉన్న అసంతృప్తిని బహిరంగంగానే  వ్యక్త పరుస్తున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను కాదని.. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో హస్తానికి మద్దతిస్తున్న మాయావతి, సందర్భాన్ని బట్టి కాంగ్రెస్‌ను విమర్శిస్తూనే ఉన్నారు. గత ఐదు నెలల నుంచి మధ్యప్రదేశ్‌లో తాను మద్దతిస్తున్న కమల్‌నాథ్‌ ప్రభుత్వంపైనా అదే స్థాయిలో అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ మెజారిటీకి రెండు సీట్లు తక్కువ సాధించిన సంగతి తెలిసిందే.