మీ ఓటుతోనే ప్రత్యేకత: మోదీ

బిజెపికి  అత్యంక కీలకమైన ఆరో దశ పోలింగ్ ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర  మోదీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బిజెపి జాతీయాధ్యక్షుడు ఓటర్లకు ప్రత్యేక సందేశం అందజేశారు. 

‘‘మరో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు రావాలని కోరుతున్నాను. ముఖ్యంగా యువత భారీ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటారని ఆశిస్తున్నాను. మీ ఓటింగ్‌తో ఈ ఎన్నికలు మరింత ప్రత్యేకతను సంతరించుకుంటాయి’’ అని మోదీ ట్విటర్‌ వేదికగా అభిప్రాయపడ్డారు. 

అలాగే అర్హత గల ఓటర్లంతా భారీ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలని బిజెపి సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు. దేశ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు.

మరోవైపు బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా.. బలమైన ప్రభుత్వాన్ని ఎంచుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి ఓటు ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని తెలిపారు.