ఎన్నికల రోజు ప్రియాంకకు కాంగ్రెస్ నేతల షాక్ !

సరిగ్గా ఆరోదశ పోలింగ్ జరుగుతున్న రోజే తూర్పు యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ప్రియాంక గాంధీకి ఊహించని షాక్ తగిలింది. ప్రియాంక తమను అవమానించారని ఆరోపిస్తూ ఓ జిల్లా అధ్యక్షురాలు సహా మరికొందరు ఆఫీస్ బేరర్లు పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక ఎంపీ అభ్యర్థిపై తాము ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ప్రియాంక తమను పట్టించుకోలేదని భదోహి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం మిశ్రా ఆరోపించారు.

‘‘శుక్రవారం జరిగిన ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి రమాకాంత్ యాదవ్‌ జిల్లా నేతలెవరితోనూ సహకరించలేదని ప్రియాంక గాంధీకి ఫిర్యాదు చేశాం. ఇక్కడ జరిగిన ర్యాలీకి ఒక్క ఆఫీస్ బేరర్‌ని కూడా ఆహ్వానించలేదని ఆమె దృష్టికి తీసుకెళ్లాం. అయినప్పటికీ ప్రియాంక కనీసం తమ ఆవేదన పట్టించుకోలేదు. ప్రతిగా పరుష పదజాలంతో మమ్మల్ని అక్కడి నుంచి పంపేశారు...’’ అని మిశ్రా పేర్కొన్నారు. ప్రియాంకకు కూడా ఇలాంటి అవమానం ఎదురైతే ఆమెకు తమ బాధ ఏంటో తెలుస్తుందని మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. 

పార్టీ అభ్యర్థి యాదవ్‌కు మద్దతుగా శుక్రవారం భదోహిలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ప్రియాంక పాల్గొని ప్రసంగించారు. ఇక్కడి కాంగ్రెస్ వ్యవహారాలను ప్రస్తుతం ప్రియాంక పర్యవేక్షిస్తుండడంతో.. ఆఫీస్ బేరర్లంతా ఆమెను కలిసి ఫిర్యాదు చేశారు. కాగా రాజీనామా చేసిన అనంతరం ప్రత్యేకంగా సమావేశమైన జిల్లా కాంగ్రెస్ నేతలు... తాజాగా ఎస్పీ-బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న రంగనాథ్ మిశ్రాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.