మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయం

మే 23 తర్వాత మరోసారి భారత ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. బిజెపి, ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ప్రస్తుతం వారణాసిలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాండే హావేలి, సోనార్‌పుర, గౌరీ గంజ్, బేలుపుర, కేదార్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్‌లో కన్నా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంచిపెట్టారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయిన తర్వాత కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏ ప్రాంతానికి వెళ్లినా మోదీ తప్ప మరొకరిని ప్రధానిగా ఊహించుకోలేమని ప్రజలు చెబుతున్నట్లు కన్నా అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీ, అమిత్ షా సారథ్యంలో 300లకు పైగా సీట్లు సాధించి గత సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విధంగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన భరోసా వ్యక్తం చేశారు.