105 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్‌

అసంబ్లీ రద్దయిన కొద్ది సేపటికే తెలంగాణ రాష్ట్ర సమితి 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇద్దరికి మాత్రమే టికెట్‌ నిరాకరించామని, మరో ఐదుగురిని సిట్టింగ్‌ అభ్యర్థుల టికెట్లను పెండింగ్‌లో ఉంచామని టి ఆర్ ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు- ఓదేలు, బాబూ మోహన్‌కు టికెట్‌ నిరాకరిస్తున్నామని చెబుతూ వారికి పార్టీ పదవులు ఇస్తామని పేర్కొన్నారు.  కాగా, ఈ ఎన్నికలలో వంద సీట్లు గెలుపొందుతామని భరోసా వ్యక్తం చేసారు. మజ్స్లిస్ తమకు మిత్రపక్షమని స్పష్టం చేస్తూ, ఆ పార్టీ అభ్యర్ధులతో `స్నేహపూర్వక’ పోటీ మాత్రమె ఉంటుందని తెలిపారు. ప్రభుత్వపరంగా నరేంద్ర మోడీ ప్రభుత్వంతో తమ ప్రభుత్వం సన్నిహితంగా వ్యవహరించినా పార్టీ పరంగా బిజేపితో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసారు.

‘‘అనేక త్యాగాలు, పోరాటల తర్వాత ఆరు దశాబ్దాల తర్వాత తెలంగాణను సాధించుకున్నాం. ఆ తర్వాత అత్యంత మెజార్టీ ఇచ్చి ప్రజలు టి ఆర్ ఎస్ ను  ఎన్నుకున్నారు. అధికారంలోకి వచ్చాక కొన్ని నెలల పాటు కొన్ని ఒడుదొడుకులకు ఎదుర్కొన్నాం. ఆ తర్వాత కుదురుకున్నాం” అని చెప్పారు . తమ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రధాని, సహా కేంద్రమంత్రులు అనేక మంది ప్రశంసించారని గుర్తు చేసారు.

“ నాకు ‘ఎకానమిక్‌ టైమ్స్‌ బిజినెస్‌ రిఫార్మర్‌’ అవార్డు కూడా వచ్చింది. 40కి పైగా రాష్ట్రానికి అవార్డులు వచ్చాయి. గత నాలుగేళ్లలో 17.17 ఆర్థిక ఎదుగుదల సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్రం 21.96 శాతం ప్రగతిని సాధించింది” అని వివరించారు.  ఓ వైపు ప్రగతి పథంలో రాష్ట్రం దూసుకెళుతుంటే ప్రతిపక్ష పార్టీలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని దయ్యబట్టారు.

నీటి పారుదల ప్రాజెక్టులు మీద, పనికిమాలిన దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలో కమీషన్లు దండుకున్నామని విపక్షాలు బురదచల్లుతూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. నీటి పారుదుల రంగంపై తమ ప్రభుత్వం రూ.25వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు.