దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం.. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాం

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టిందని, ద్రవ్యోల్బణాన్ని ఎప్పటికప్పుడు అంచనావేస్తూ ముందుకెళ్తోందని హోమ్‌మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. ధరలకు కళ్లెం వేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని  ముజఫర్‌పూర్ లో స్పష్టం చేశారు. 2004 తరువాత అధిక ధరల అంశం లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొన్న ప్రభుత్వం తమదేనని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అవినీతిని నిర్మూలించడం, ధరలను అదుపుచేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను మోదీ ప్రభుత్వం విజయవంతం చేసిందని రాజ్‌నాథ్ వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చాక ధరలు ప్రచార అస్త్రంగా లేకుండా జరగడం ఎన్నికలు జరగడం ఇది రెండోసారని హోమ్‌మంత్రి చెప్పారు.

ఆదివారం పోలింగ్ జరగనున్న వైశాలి లోక్‌సభ నియోజకవర్గంలోని సరియా ఎన్నికల ర్యాలీలో బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. దివంగత నేత వాజపేయి సారధ్యంలో 2004లో బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించగా వాజపేయి ప్రధాని అయ్యారు. వాజపేయి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రాజ్‌నాథ్‌సింగ్ ‘కాంగ్రెస్ కంటే అత్యంత మెరుగైన పాలన మోదీ ప్రభుత్వం అందించింది’అని ప్రకటించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయడంతోపాటు లక్షిత దాడులు చేయించడం ద్వారా సత్తాచాటారని ఆయన ప్రశంసించారు.

‘మన సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఉగ్రవాదులు, వారి స్థావరాలను మట్టుబెట్టాం. సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించడం ద్వారా శాంతి స్థాపనకు కృషి చేశాం’అని హోమ్‌మంత్రి వివరించారు. 55 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను వెర్రివాళ్లను చేయడానికి గరీబీ హఠావో నినాదం అందుకున్నారని కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్లు కల్పించినట్టు రాజ్‌నాథ్ గుర్తు చేశారు. అలాగే 1.3 కోట్ల కుటుంబాలకు గృ హ వసతి కల్పించినట్టు ఆయన వివరించారు. స్వ చ్ఛ భారత్ అభయాన్ కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినట్టు ఆయన చెప్పారు. రహదారుల రంగంలో శీగ్రగతిన అభివృద్ధి జరిగిందని, హైవేల నిర్మాణం చేపట్టినట్టు హోమ్‌మంత్రి వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో కనీసం 7.5 కోట్ల మందిని దారిద్య్రరేఖ ఎగువకు తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు.

ఐదు, ఏడేళ్లల్లో పేదరికాన్ని నిర్మూలించాన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. 2022 నాటికి దేశంలో ఒక్క కుటుంబం కూడా ఇల్లు, ఎల్‌పీజీ కనెక్షన్ లేకుండా ఉండకూడదన్నది తమ ఉద్దేశమని ఆయన ప్రకటించారు. రైతుల కు ఏడాదికి రూ.6వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు రాజ్‌నాథ్ చెప్పారు. వృద్ధుల సామాజిక భద్రత కోసం చర్యలు తీసుకున్నామన్నారు.