బిజెపి మోదీ, షా‌ పార్టీ ఎన్నటికీ కాదు : గడ్కరీ

భారతీయ జనతా పార్టీ ఎన్నటికీ ఏక వ్యక్తి కేంద్రంగా వుండదని, బలమైన సిద్ధాంత పునాదిగానే నడుస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుండబద్దలు కొట్టారు. బీజేపీ రానూ రానూ మోదీ కేంద్రంగానే నడుస్తోందన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వాజ్‌పాయ్, ఆడ్వాణీ ఉన్న రోజుల్లోనూ అలా నడవలేదని, ఇప్పుడూ అలా నడవదని స్పష్టం చేశారు.

బీజేపీ సైద్ధాంతిక పునాదులున్న పార్టీ అని, మోదీ,షా‌ పార్టీ ఎన్నటికీ కాదని వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరానే కాంగ్రెస్, కాంగ్రెస్సే ఇందిరా అని అప్పటి అధ్యక్షుడు డీకే బరువా నినదించినట్టు ప్రస్తుతం మోదీ అంటే బీజేపీ, బీజేపీ అంటే మోదీ అన్నట్లు తయారైందా? అన్న ప్రశ్నకు గడ్కరీ స్పందిస్తూ బీజేపీ ఎప్పటికీ వ్యక్తి కేంద్రంగా నడవదని ఆయన తెలిపారు. అయితే బీజేపీ - మోదీ ఒకరికొకరు ప్రత్యామ్నాయ శక్తులని ఆయన పేర్కొన్నారు. పార్టీ భావజాలాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్న ప్రధాని మోదీ బలమైన నాయకుడుగా ఎదిగారని తెలిపారు. 

బీజేపీలో కుటుంబ పాలన లేదని, కీలక నిర్ణయాలన్నీ కూడా బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకుంటుందని ఆయన తెలిపారు. పార్టీ బలంగా ఉండి, ఒకవేళ అభ్యర్థి బలంగా ఉంటే, అలాగే పార్టీ బలహీనంగా ఉండి, అభ్యర్థి బలంగా ఉన్నా గెలుపు సాధ్యం కాదని అన్నారు. కానీ ఒక బలమైన నాయకుడు మాత్రం అభ్యర్థిగా ఉంటే సహజంగానే పార్టీ ముందంజలో ఉంటుందని గడ్కరీ తెలిపారు.

ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమని వస్తున్న విమర్శలను గడ్కరీ తిప్పికొట్టారు. గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధించి కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారాన్ని చేపడుతుందన్నారు. బీజేపీ అభివృద్ధి అజెండాను పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షాలు కులమతాల పేరుతో విషబీజాలు నా టేందుకు ప్రయత్నిస్తున్నాయని, కానీ పూర్తి మెజారిటీతో బీజేపీకి ప్రజలు మళ్లీ పట్టం కడతారనే ఆశాభావాన్ని ఆయ న వ్యక్తం చేశారు. సమర్థ పాలన, అభివృద్ధి మా తొలి ప్రాధామ్యాలనీ, పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించాలనేదే మా ప్రభుత్వ లక్ష్యాలనీ చెప్పారు.

పాక్ గడ్డమీద ఉగ్రవాద స్థావరాలను నేలకూల్చి బీజేపీ ప్రభుత్వం ధీటైన జవాబునిచ్చింది. ఇలాంటివి ఎదురైనప్పుడు భద్రత గురించి చర్చ జరగడం సాధారణం. కానీ బీజేపీ ఎప్పుడూ జాతీయవాదా న్ని ఒక సమస్యగా సృష్టించలేదని పేర్కొన్నారు. 

పుల్వామా దాడికి ఇంటెలిజెన్స్ వైఫల్యమని భావిస్తున్నారా అన్న ప్రశ్న కు గడ్కరీ బదులిస్తూ, ఉగ్ర దాడులను ఏ దేశమూ ఇంటెలిజెన్స్ వైఫలంగా పరిగణించదు. ఎందుకంటే అది దీర్ఘకాల పోరాటం. ఇలాంటి దాడులు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వం టి దేశాల్లోనూ జరుగుతున్నాయి. దాడుల అనంతరం ఇంటెలిజెన్స్ వైఫల్యమని తేలిగ్గా అనేస్తారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది భగవంతుడి సృష్టికాదు అని వ్యాఖ్యానించారు.