ప్రధాని పదవికి పోటీయే లేదు

ప్రధానమంత్రి పదవికి పోటీయే లేదని, నరేంద్ర మోదీయే మళ్లీ ప్రధాని కాబోతున్నారని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. మాయావతి ప్రధాని పదవి కోసం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిపోతున్నారని చెప్పారు. హంగ్‌ వస్తుందని, తామే సూత్రధారులమవుతామని చంద్రబాబు, మమత బెనర్జీ ఆశలు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. కానీ వీరిద్దరికీ సొంత రాష్ట్రాల్లోనే పట్టు నిలబెట్టుకోవడం కష్టమవుతుందని జోస్యం చెప్పారు.

బిజెపియేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం వస్తుందని కేసీఆర్‌ కలలుగంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీల నేతలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్ధం కావట్లేదని ధ్వజమెత్తారు. ఓడిపోయేవారి ఆశలు (ద హోప్‌ ఆఫ్‌ లూజర్స్‌) అనే ఓ పోస్టులో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ప్రస్తుతం ప్రధాని పదవికి పోటీ అనేది ఒకే గుర్రంతో నిర్వహిస్తున్న గుర్రపు పందెంలా ఉంది. ఐదేళ్ల ప్రభుత్వం కావాలా? ఐదు నెలల్లో ముగిసే సర్కారు కావాలా అనే అంశంపై ఓటర్లు చాలా స్పష్టంగా ఉన్నారు. అందుకే 2014 కంటే ఎక్కువ ఆధిక్యంతో మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయం. రాజకీయ బద్ధశత్రువులు కూడా మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నారు. ఓటర్లు తెలివితక్కువ వాళ్లని, అస్పష్టమైన తీర్పు (హంగ్‌) వస్తుందని వాళ్లు ఆశపడుతున్నారు. ఈ అనుమానాలన్నీ 23న పటాపంచలవుతాయి’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 2014లో ఆ పార్టీ బలాన్ని రెండంకెలకు తగ్గించేశారని జైట్లీ గుర్తు చేశారు. ఇప్పుడు ఆ స్థానాలన్నా నిలబెట్టుకుంటామా లేదా అని ఆ పార్టీ ఆందోళనపడుతోందని దయ్యబట్టారు.