ఓటమి భయంతో ఒత్తిడిలో టిడిపి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తుంటే చంద్రబాబు మాత్రం ఎన్నికలంటేనే బెంబేలెత్తిపోతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తీవ్రంగా దుయ్యబట్టారు.

ఓటమి భయంతో టీడీపీ తీవ్ర ఒత్తిడిలో ఉందనని రాజ్యసభ సభ్యుడు, బిజెపి అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు పేర్కొన్నారు. చంద్రబాబుకు ఈసారి అధికారం మూడు నాళ్ల ముచ్చటే అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తుంటే చంద్రబాబు మాత్రం ఎన్నికలంటేనే బెంబేలెత్తిపోతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు.

అమరావతిలో కనీసం శాశ్వత భవనం కట్టలేకపోయారని, సెక్రటేరియట్‌ నిర్మించలేని చంద్రబాబు ఒలంపిక్స్‌ నిర్వహిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, మంత్రులు, ఎమ్మెల్యేలను చూసి అధికారులు కూడా అవినీతిపరులుగా మారారని ద్వజమెత్తారు.

అవినీతికి చట్టబద్ధత తెచ్చిన ఘనుడు చంద్రబాబేనని జివిఎల్ వెల్లడించారు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొని వాళ్లలో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చెయ్యడమే అవుతోందని విమర్శించారు. సీఎం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే స్పీకర్‌ చూస్తూ ఉన్నారని మండిపడ్డారు. కచ్చితంగా ఈ సమావేశాల్లో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ప్రభుత్వమేనని జివిఎల్ పేర్కొన్నారు. ఏపీ ఫిషరీష్‌ ద్వారా వేల కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారని ఆరోపిస్తూ, వాటి వివరాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమరావతి బాండ్ల ఇన్వెస్టర్ల పేర్లు ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

చంద్రబాబు అప్పు చెయ్యటంలో నెంబర్‌ వన్‌ అని నిరూపించుకున్నారని అంటూ అప్పుల్లో కూడా అవినీతి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబేనని ధ్వజమెత్తారు. హెరిటేజ్‌ భూములు మాత్రం అమరావతి నిర్మాణంలో పోకుండా చేశారనే అపవాదు ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫండ్‌ కోసం అమరావతిని బాబు వాడుకుంటున్నారని విమర్శించారు.

అవినీతికి పాల్పడిన వారి పేర్లు త్వరలోనే బయటపెడతామని జివిఎల్ వెల్లడించారు. ప్రజల మధ్యలో టీడీపీ ఎమ్మెల్యేలు దళారీలుగా ఉన్నారని, ప్రతి నియోజకవర్గంలో కాంట్రాక్టు పనుల కోసం టీడీపీ ఎమ్మెల్యేలకు 10 శాతం వాటా ఇవ్వాల్సిన పరిస్థితి ఏపీలో ఉందని విమర్శించారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌ రాజకీయ బాధితుడిగా మారాడని వ్యాఖ్యానించారు.