ప్రధాని కావాలంటే కాంగ్రెస్ లో విలీనం కావాల్సిందే!

150 నుండి 200 వరకు సీట్లు గెలుచుకోకుండా ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధంగా లేరని స్పష్టం అవుతున్నది. ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ కు 100 సీట్లు దాటి రావటమే కష్టం కాగలదని భావిస్తున్నారు. బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన సంఖ్యాబలాన్ని సమకూర్చుకోలేని పక్షంలో కాంగ్రెస్ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం తప్ప మరో మార్గం ఉండదు.

చాలామంది ప్రతిపక్ష నేతలు అటువంటి పరిస్థితి కోసమే ఎదురు చూస్తున్నారు. బిజెపి, కాంగ్రెస్ లులేని ప్రభుత్వం ఏర్పాటులో ప్రధాన మంత్రి పదవి లభించ గలదని ఆశపడుతున్నారు. అయితే మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒక మెలిక పెడుతున్నట్లు తెలుస్తున్నది. ఆ పార్టీని ముందుగా కాంగ్రెస్ లో విలీనం చేయాలనీ స్పష్టం చేస్తున్నది. ఈ విషయమై ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవర్ సన్నిహితులకు సంకేతం ఇచ్చిన్నట్లు తెలిసింది. మహారాష్ట్రలో తగు సంఖ్యలో సీట్లు రాని పక్షంలో ప్రధాని పదవికి పవర్ మొగ్గు చూపే అవకాశం ఉండదు.

అటువంటప్పుడు మాయావతి, మమతా బెనర్జీ లలో ఒకరికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఎంతకాలం ఉంటుందో తెలియని ప్రధాన మంత్రి పదవి కోసం తమ పార్టీలను కాంగ్రెస్ లో విలీనం చేసుకొని గాంధీల దయాదాక్షిణ్యాలపై ఆధార పడటానికి ఈ నేతలు ఇష్టపడే ప్రసక్తి ఉండదు. ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ ను ప్రధానిగా ప్రతిపాదించే ఆలోచనలు కాంగ్రెస్ వర్గాలు చేస్తున్నాయి.

గతంలో దేవెగౌడ ప్రధాని పదవి కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారు. కానీ ప్రధానిగా ఒక సంవత్సరం కూడా ఉండలేక పోయారు. ఆ తర్వాత తిరిగి ముఖ్యమంత్రిగా వెళ్లలేక పోయారు. అటువంటి పరిస్థితులను మమతా బెనర్జీ వంటి వారు కోరుకొనే అవకాశం ఉండదు.