మంత్రి పదవికి కిడారి శ్రావణ్‌ రాజీనామా

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించారు. ఇది వెంటనే అమల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో శ్రావణ్‌ ప్రాథమిక వైద్యం, గిరిజన సంక్షేమం తదితర శాఖలకు ప్రాతినిధ్యం వహించారు.

అరకు ఎమ్మెల్యేగా ఉన్న కిడారి సర్వేశ్వరరావును నక్సల్స్‌ హత్య చేయడంతో ఆయన కుమారుడైన శ్రావణ్‌ను చంద్రబాబు గత ఏడాది నవంబరు 11న తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. అప్పటికి ఆయన ఉభయ సభల్లోనూ సభ్యుడు కాదు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపు ఏదో ఒక చట్టసభ నుంచి సభ్యుడిగా ఎన్నిక కావలసి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రావణ్‌ విశాఖ జిల్లా అరకు నుంచి పోటీ చేశారు. కానీ ఇంకా ఫలితాలు రాలేదు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు పూర్తవుతున్నా, ఇంత వరకు ఏ చట్టసభలోను సభ్యుడిగా ఎన్నిక కాకపోవడంతో రాజీనామా అనివార్యమైంది. గురువారంతో ఈ గడువు ముగుస్తున్న విషయాన్ని గవర్నర్‌ గుర్తు చేశారు. దీంతో శ్రావణ్‌ గురువారం సచివాలయానికి వచ్చి.. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర ఓఎ్‌సడీ మారుతీప్రసాద్‌ కార్యాలయంలో తన రాజీనామా లేఖను అందజేశారు. చంద్రబాబు పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ఉండడంతో అధికారులు ఆయన సలహా తీసుకుని రాజీనామాను గవర్నర్‌కు పంపారు. ఆయన వెంటనే దానిని ఆమోదించారు. మంత్రిగా శ్రావణ్‌ సేవలను గవర్నర్‌ ప్రశంసించారు.

‘50 ఏళ్లకే గిరిజనులకు పెన్షన్లు ఇవ్వాలన్నది నా తండ్రి సర్వేశ్వరరావు ఆశయం. నేను గిరిజన మంత్రిగా ఉన్నప్పుడు గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతో ఆనందం కలిగించింది. తండ్రి ఆశయాన్ని నెరవేర్చానని సంతృప్తి ఇచ్చింది’ అని శ్రావణ్‌ తెలిపారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపానారు. ‘నా తండ్రి మరణానంతరం ఆపద సమయంలో చంద్రబాబు మా కుటుంబానికి అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు.