ఇంటర్ విద్యార్థులను వదిలేసి కేసీఆర్ విహార యాత్రలా?

రాష్ట్రంలో ఇంటర్ బోర్డు వైఫల్యంతో విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ విహారయాత్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె  లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కన్‌కల్ గ్రామంలో మరణించిన దళిత విద్యార్థి జ్యోతి కుటుంబ సభ్యులను ఆయన  పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత కుటుంబానికి చెందిన విద్యార్థిని జ్యోతి మరణం తీవ్రంగా కలిచివేస్తున్నదని చెప్పారు.రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోందని మండిపడ్డారు.

రాష్ట్రప్రభుత్వం నిరంకుశ విధానాలను విడనాడాలని లక్ష్మణ్ హితవు చెప్పారు. ముఖ్యమంత్రికి అధికార యావ తప్ప మరొకటి లేదన్నారు. కనీసం చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు ముఖ్యమంత్రికి , మంత్రులకు తీరిక లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు విద్యార్థుల ఉద్యమాలే స్ఫూర్తినిచ్చాయని గుర్తు చేశారు. ఈ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు ఆత్మార్పణ చేసుకున్నారని పేర్కొన్నారు. బోర్డు తప్పిదాలను కప్పిపుచ్చే ప్రయత్నం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందని ధ్వజమెత్తారు.

ఫలితాలు వెలువడిన వెంటనే ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో చీకటి రోజని చెప్పారు. అనేక తప్పిదాలు జరిగాయని, విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, రాష్ట్రప్రభుత్వం తప్పిదాలను గ్రహించి విద్యార్థులు, తల్లితండ్రులకు భరోసా కల్పించాలని ఆయన కోరారు.

కాగా, రాష్ట్రంలో 25 మంది విద్యార్థులను బలి తీసుకున్న ఇంటర్‌ ఫలితాల అవకతవకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలి బాధ్యుడు అని బిజెపి  సీనియర్‌ నాయకుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. నారాయణపేట జిల్లా ధన్వాడ, ఊట్కూరు మండలాల్లో ఇటీవల ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా వారి కుటుంబాలను బుధవారం ఆయన పరామర్శించారు. ధన్వాడ మండలం కొండ్రోనిపల్లిలో బలవన్మరణానికి పాల్పడిన శిరీష కుటుంబాన్ని కిషన్‌రెడ్డి ఓదార్చారు.

కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక 70 రోజులపాటు ఉన్నత విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నారని, ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలే ఇంటర్‌ బోర్డు దుస్థితికి కారణమని విమరిశలు. మృతుల కుటుంబాలకు న్యాయం చేసేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదనీ, త్వరలో ఈ విషయాన్ని రాష్ట్రపతి, హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.