స్వలింగ సంపర్కానికి సుప్రేం చట్టబద్ధత

స్వలింగ సంపర్కానికి సుప్రేం కోర్ట్ చట్టబద్ధత కల్పించింది. స్వలింగ సంపర్కం నేరం కానే కాదని స్పష్టం చేసింది. ఇన్నాళ్లు వాళ్లంతా ద్వితీయశ్రేణి పౌరుల్లా దాక్కోవాల్సి వచ్చిందని, అందుకు ఈ సమాజం వారికి క్షమాపణ చెప్పాల్సిందేనని వ్యాఖ్యానించింది.

బ్రిటిష్ కాలం నాటి సెక్షన్ 377ను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. లైంగిక ధోరణి ఆధారంగా ఒకరి పట్ల వివక్ష చూపించడం అంటే రాజ్యాంగం వారికి ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర వ్యాఖ్యానించారు. తీర్పులోని ప్రధాన భాగాన్ని ఆయనే స్వయంగా చదివి వినిపించారు.

ఇద్దరు వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో కూడిన లైంగిక సంబంధాలను నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377ను రద్దుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏ ఒక్క పౌరుడి ప్రాథమిక హక్కులను కాలరాయడానికీ సంఘ నీతిని ఉపయోగించకూడదని, సంఘనీతి అనే బలిపీఠంపై రాజ్యాంగ నైతికతను బలివ్వకూడదని జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు.

ఎల్‌జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గాన్ని వేధించడానికి ఐపీసీ సెక్షన్ 377ను ఒక ఆయుధంలా వాడుతున్నారని ప్రధాన న్యాయమూర్తి విమర్శించారు. ఈ తీర్పు విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న మొత్తం ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ఐదుగురు కలిసి నాలుగు వేర్వేరు తీర్పులు వెల్లడించారు.

పరస్పర అంగీకారం ఉన్న, అంగీకారం లేని లైంగిక చర్యలకు మధ్య తేడాను సెక్షన్ 377 గమనించలేకపోయిందని వారు అన్నారు. అయితే ఈ తీర్పు తర్వాత కూడా జంతువులతో సంభోగాన్ని మాత్రం నేరంగానే పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు.