గెలుపుపై సాధ్వి ప్రజ్ఞా సింగ్ ధీమా

కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఈ నేపథ్యంలో విజయం తననే వరిస్తుందని  భోపాల్ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ హిందుత్వ వాదనలను ఎండగడతామంటూ కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ పేర్కొనడం హాస్యాస్పదమని ఆమె ధ్వజమెత్తారు.

హిందూ ఆధ్యాత్మిక గురువు నామ్‌దేవ్ త్యాగీ అలియాస్ కంప్యూటర్ బాబాతో కలసి భవానీ చౌక్ నుంచి లాల్ పరేడ్ మైదానం వరకు ఆమె భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ప్రధాన మార్గాల మీదుగా కొనసాగిన ఈ ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రజ్ఞా సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్‌ను ఓడించాల్సిందిగా పిలుపునిచ్చారు.

ఆధ్మాతిక గురువు నామ్ దేవ్ మాట్లాడుతూ రామ్ మందిర్ నిర్మాణం కేవలం మోదీ వల్లనే సాధ్యమని స్పష్టం చేశారు. మోదీ లేకపోతే రామ మందిరం రాదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజ్ఞా సింగ్‌తో భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడుతున్న దిగ్విజయ్ సింగ్ బుధవారం పోటీ ర్యాలీని నిర్వహించారు. ప్రజ్ఞా సింగ్ ర్యాలీ ముందు దిగ్విజయ్ సింగ్ ర్యాలీ వెలవెలబోయింది. వేలాదిమంది హిందుత్వ వాదులు కాషాయ జెండాలను పట్టుకుని ప్రజ్ఞా సింగ్‌కు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో రోడ్లన్నీ కాషాయమయంగా కనిపించాయి.