తెలంగాణ అసెంబ్లీ రద్దు

కొద్దిరోజులుగా వస్తున్నా ఉహాగానలకు తెరదించుతూ అసెంబ్లీని రద్దు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో ఏకవాక్య తీర్మానం ఆమోదింప చేసుకొని, వెంటనే మంత్రివర్గ సహచరులతో కలసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. వెంటనే గవర్నర్ ఆమోద ముద్ర వేసి అసెంబ్లీని రద్దు చేసారు.

గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పెద్దగా  చర్చ ఏమీ లేకుండా అసెంబ్లీ రద్దుకు ఉద్దేశించిన తీర్మానాన్ని అరగంట లోపలనే ఆమోదించింది.శాసనసభ రద్దు సిఫారసుకు సంబంధించిన తీర్మానంపై మంత్రుల అందరి సంతకాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు మంత్రులు అందరితో కలసి ఒక బస్సు లో వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి మంత్రివర్గం తీర్మానం కాపీని అందజేశారు.

తర్వాత కొద్దిసేపటికి తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను ఎన్నికల కమీషన్,  అసెంబ్లీ కార్యదర్శికి రాజ్‌భవన్‌ వర్గాలు పంపాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా రద్దయింది.

ఇదిలా ఉంటే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్ కోరారు. ఇందుకు కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్‌, మంత్రులు కొనసాగాలని జీవో నెంబర్‌ 134ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి జారీ చేశారు.

అసెంబ్లీ రద్దు అధికారాన్ని అంతకుముందే కేసీఆర్‌కు కట్టబెట్టిన మంత్రులు తీర్మానంపై చర్చ లేకుండానే వెంటనే సంతకాలు చేశారు. రాజ్ భవన్ నుండి నేరుగా గన్ పార్క్ వద్దకు వెళ్లి మృత వీరులకు శ్రద్దాంజలి ఘటించారు. అక్కడి నుండి తెలంగాణ భవన్ కు వెళ్లారు.

ప్రతిపక్షాలు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యే లోపుగానే ఉధృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టడానికి సన్నాహాలు చేసుకున్నారు. 50 రోజుల పాటు, వంద అసెంబ్లీ నియోజకవర్గాలలో కెసిఆర్ బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. ముందుగా శుక్రవారం హుస్నాబాద్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.