"సింహపురి"కి టిడిపి, వైసిపి నేతల రక్షణ !

 నిరుపేద గిరిజనుడి కిడ్నీ కుంభకోణానికి సంబంధించి నెల్లూరు జిల్లాలోని సింహపురి ఆస్పత్రి యాజమాన్యంపై వెంటనే తగు చర్య తీసుకోకుండా నిత్యం పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకొనే టిడిపి, వైసిపిలకు చెందిన ప్రముఖ నేతలు కలసి రక్షణ కల్పిస్తూ ఉండటం గమనార్హం. 

ఆ ఆసుపత్రి యజమాని ఒక వంక మంత్రి చంద్రమోహన్ రెడ్డికి సమీప బంధువు కావడం, మరోవంక వైసిపి నేత విజయసాయిరెడ్డి సోదరుడికి వియ్యంకుడు కాబోతూ ఉండడంతో చివరకు సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా కాపాడే ప్రయత్నం చేశారు. 

జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టుబట్టడం, స్థానిక మీడియా వరుసగా కధనాలు ప్రచురిస్తూ ఉండడంతో ప్రస్తుతానికి కేసులు నమోదైనా వారింట్లో జూన్ 6న వివాహం జరిగే వరకు ఎటువంటి చర్య ఉండబోదని రెండు పార్టీల నేతలు భరోసా ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. 

తాజాగా, ఎస్‌సి.,ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదైంది. ఇప్పటికే 420, 384 కేసులు నమోదు చేశారు. 15 రోజల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గిరిజన యువకుడు ఏకోల్లు శ్రీనివాసులు స్థానిక సింహపురి ఆసుపత్రిలో చేరాడు. ఆస్పత్రి యాజమాన్యం బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించారు. చికిత్స పేరుతో 1.28 లక్షలు బిల్లు చెల్లించాలని పట్టుబడ్డారు. లేని పక్షంలో అవయవదానం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలున్నాయి. 

నిరుపేద కుటుంబం కావడంతో అవయవదానానికి ఒప్పుకున్నారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో కలెక్టర్‌ ఆర్‌. ముత్యాలరాజు కావలి సబ్‌ కలెక్టర్‌చే విచారణ జరిపించారు. తప్పు జరిగినట్లు రుజువు కావడంతో సెక్షన్‌ 420, 384 కింద కేసు నమోదు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆసుపత్రికి నోటీసులు జారీ చేసింది. 

ఈ సంఘటనకు సంబందించి జిల్లాలోని ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు ఆ కుటుంబానికి అండగా నిలిచాయి. శ్రీనివాసులు కుటుంబానికి ఆదివారం కలెక్టర్‌ లక్ష రూపాయలు పరిహారం ప్రకటించారు. పది లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.