మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

రాబోయే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించబోతోందని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వచ్చే ఐదేళ్లలో భారత్‌ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుంది’’ అని చెప్పారు.

ఝార్ఖండ్‌లోని గొడ్డా లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్‌ పాల్గొంటూ గత నాలుగేళ్లలో 1.3 కోట్ల మంది అర్హులకు పక్కా ఇళ్లు కట్టించామని, రాబోయే ఏడేళ్లలో దేశంలో ఒక్క కుటుంబం కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉండకూడదనేలా ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. తమ హయాంలో 7.5 కోట్ల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తేగలిగామని గుర్తు చేశారు.

2014కు ముందు దేశమంతా 12 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు మాత్రమే ఇచ్చారని, ఈ నాలుగేళ్లలో తాము 13 కోట్ల ప్రజలకు ఇచ్చామని గుర్తు చేశారు. రోడ్ల నిర్మాణ పనులు రోజుకు 6 కిలోమీటర్ల నుంచి 32 కిలోమీటర్లకు చేరుకున్నాయని వివరించారు. స్థానిక లోక్‌సభ బిజెపి అభ్యర్థి నిషికాంత్‌ దుబేకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. 

గొడ్డా లోక్‌సభ నియోజకవర్గంలో మే 12న పోలింగ్‌ జరగనుంది. దుబేకు వ్యతిరేకంగా ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చా తరపున ప్రదీప్‌ యాదవ్‌ బరిలో ఉన్నారు. ఈయనకు మహాకూటమి మద్దతు పలుకుతోంది.