తెలంగాణలో రాష్ట్రపతి పాలన అవకాశం !

ఒక వంక అసెంబ్లీని రద్దు చేసి, డిసెంబర్ లో ఉత్తరాది రాస్త్రాలతో పాటు ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే, తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేసినంత మాత్రం చేత వెంటనే ఎన్నికలు జరుగాలనే నిబంధనలు ఏవీ లేవని, రాష్త్రపతి పాలన విధించే అవకాశం కుడా లేకపోలేదని బిజెపి నేతలు పేర్కొనడం రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపుతున్నది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మెజారిటీ ఉందని, మంత్రివర్గంను సమావేశ పరచి అసెంబ్లీని రద్దు చేయడం వరకే ఆయన చేతుల్లో ఉంటుందని రాష్ట్ర బిజెపి అద్యక్షుడు డా. కే లక్ష్మణ్ స్పష్టం చేసారు. ఆ తరువాత పరిణామాలన్నీ రాజ్యాంగ సంస్థల చేతుల్లో ఉంటాయని తెలిపారు. అసెంబ్లీ రద్దు తరువాత రాష్ట్రపతి పాలన వస్తుందా.? ఆపధర్మ ప్రభుత్వమా.? ముందస్తు ఎన్నికలు వస్తాయా.? లేక వచ్చే ఏడాది జరుగుతాయా? అన్నది రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగ సంస్థలు తేలుస్తాయని పేర్కొన్నారు.

అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేసిన తరువాత ఏం జరుగుతుందో తేలిపోతుందని అంటూ ఎద్దేవా చేసారు. కాగా, టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు, సినీ నటి సత్య చౌదరి బీజేపీలో లక్ష్మణ్ సమక్షంలో చేరారు. అసెంబ్లీ రద్దు చేశాం గదా అన్నీ తాను అనుకున్నట్టుగా జరుగుతాయని కేసీఆర్ భావిస్తున్నట్టున్నారని వ్యాఖ్యానించారు.

అందరి హక్కులు ఒక్కరి గుప్పిట్లో ఉండవన్న సంగతిని కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వంటి వ్యక్తులను ఇక్కడి ప్రజలు చూశారని, ఓడించారని ఆయన గుర్తు చేశారు. జమిలీ ఎన్నికలు జరపడం ద్వారా ఖర్చు తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయత్నిస్తుంటే, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాలని ప్రయత్నిస్తున్నారని డా. లక్ష్మణ్ ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోతుందని తేల్చి చెప్పారు. ఐదు రోజుల్లో మంత్రివర్గ సమావేశాలు వరుసగా నిర్వహించినా, హామీలు గుప్పిస్తున్న ప్రజలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ వైఖరికి ప్రజలు విసిగి పోయారని తెలిపారు. చివరకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా అసంతృప్తిగా ఉన్నారని చెబుతూ అందుకే ప్రగతి నివేదన సభ నిర్వహించినా ప్రజలు పట్టించుకోలేదని పేర్కొన్నారు.