వీవీప్యాట్లపై ప్రతిపక్షాలకు సుప్రీం కోర్ట్ లో ఎదురుదెబ్బ

వీవీప్యాట్ల అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో ప్రతిపక్షాలకు ఎదురుదెబ్బ తగిలింది. కనీసం 50శాతం వీవీప్యాట్‌ చీటీలను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘ఈ అంశంలో మేమిచ్చిన తీర్పును సవరించేందుకు ఆసక్తిగా లేము’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్లపై కేవలం ఒకే ఒక్క నిమిషంలో వాదనలు ముగించి కోర్టు తీర్పు వెల్లడించింది. 

సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా లెక్కించే వీవీప్యాట్‌ స్లిప్పుల సంఖ్యను పెంచాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఒక శాసనసభ నియోజకవర్గంలోని అయిదు వీవీప్యాట్‌ స్లిప్పులను ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో సరిపోల్చాలని ఎన్నికల కమిషన్‌ను ఏప్రిల్‌ 8న ఆదేశించింది.

అయితే ఈ తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ విపక్షాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. శాసనసభ నియోజకవర్గం పరిధిలో కనీసం 50శాతం వీవీప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి.

‘వీవీప్యాట్‌ చీటీల లెక్కింపును ఒకటి నుంచి అయిదుకు చేయడం సహేతుకమైన సంఖ్య కాదు. అది సంతృప్తి కలిగించేదీ కాదు’ అని ప్రతిపక్ష పార్టీలు పిటిషన్‌లో పేర్కొన్నాయి. అయితే ఈ రివ్యూ పిటిషన్లను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించలేదు.