రేవ్‌ పార్టీ సూత్రధారులపై చర్యలు తీసుకోవాలి

ఏపీ మంత్రిపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. విశాఖలో జరిగిన రేవ్ పార్టీ వెనుక ఓ మంత్రి హస్తం ఉందని ఆరోపించిన బిజెపి ఎమ్యెల్యేవిష్ణుకుమార్‌ రాజు   విశాఖపట్నంలో ఏప్రిల్‌ 13న జరిగిన రేవ్‌ పార్టీ వెనకున్న సూత్రదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోమ్ కార్యదర్శి లను కలసి ఫిర్యాదు చేశారు. 

విశ్వనాథ్‌ బీచ్‌ ఫ్రంట్‌లో రేవ్‌ పార్టీ నిర్వహించేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి పేషీ నుంచి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌పై ఒత్తిడి తెచ్చి లిక్కర్‌ లైసెన్స్‌ తెచ్చుకున్నారని చెప్పారు. అంత టితో ఆగకుండా కొకైన్‌ వంటి మత్తు పదార్థాలు వాడి విశాఖను కలుషితం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకున్నప్పటికీ పార్టీని ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ధైర్యం లేదని ధ్వజమెత్తారు. అసలు సూత్రదారులను వదిలేసి మిగిలిన వారిపై తూతూమంత్రంగా చర్యలు తీసకున్నారని మండిపడ్డారు.  

విశాఖను డ్రగ్ సిటీగా మార్చాలని చూస్తున్నారని, కోడ్ ఉన్నప్పుడు బీచ్‌లో మద్యం తాగడానికి అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అధికారులపై ఒత్తిడి చేసి లైసెన్స్‌లు తీసుకున్నారని మండిపడ్డారు. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి పేషీ నుంచి 8 సార్లు ఫోన్ చేశారని, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావుకు మంత్రి పీఏ ఫోన్ చేసి ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఈ అంశంపై వైసీపీ, జనసేన స్పందించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విషయంలో ఎందుకు స్పందించడం లేదని అంతకు ముందు విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ఈ రేవ్‌ పార్టీలో పదిమంది యువతులతో పాటు సుమారు 50 మందికిపైగా పాల్గొన్నారని, విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు విదేశీ మద్యాన్ని అంతా సేవించారని తెలిపారు. విశ్వనాథ్‌ బీచ్‌ ఫ్రంట్‌ పేరిట మాత్రమే రాష్ట్ర పర్యాటక సంస్థ అనుమతులు జారీ చేసిందని, మంత్రి అనుచరుడు లీజు పేరిట మద్యం తాగేందుకు ఎక్సైజ్‌ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారని వివరించారు. బీచ్‌ ఫ్రంట్‌ లీజుదారులను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ప్రశ్నించారు.