దేశ భద్రత కోసం మోదీకి మరోసారి ఓటు

దేశ భద్రత కోసం నరేంద్రమోదీకి మరోసారి ఓటు వేసి గెలిపించాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అభ్యర్థించారు. సీమాంతర ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించే సమర్ధత మోదీ సర్కార్‌కే ఉందని బీహార్ లో  స్పష్టం చేశారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదుల చొరబాట్లు, దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టిన ఘనత కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని షా చెప్పారు. 

యూరి ఉగ్రదాడి తరువాత తొలిసారి భారత్ లక్షిత దాడులు చేసిందని ఆయన గుర్తుచేశారు. పుల్వామాలో 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న తరువాతే బాలాకోట్‌పై వైమానిక దాడులు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. లక్షిత దాడులను దేశం యావత్తూ హర్షిస్తుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ విషాదంలో మునిగిపోయారని ఆయన దుయ్యబట్టారు.

సరిహద్దుల్లో చొరబాట్లు, ఉగ్రవాదం పీచమణిచే సమర్థత గల మోదీకే మరోసారి పట్టం గట్టాలని అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. తూర్పు చంపారన్ జిల్లా మధుబన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో బీజేపీ చీఫ్ ప్రసంగిస్తూ ‘దేశ భద్రత అన్న ఒక్క కారణంతోనే మోదీకి ఓట్లడుగుతున్నా’అని వెల్లడించారు. గత ప్రభుత్వాల పనితీరును ఓ సారి గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన ఓటర్లను కోరారు. 

పాక్ అండదండలతో ఉగ్రవాదులు భారత్‌పైకి తెగబడేవారని, భారత్ జవాన్లపై అడ్డూఅదుపూలేని ఆకృత్యాలు జరిగేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఇంత భయానక పరిస్థితులన్నప్పటికీ వౌనీ బాబా(మన్మోహన్), రాహుల్ బాబా స్పందించిన దాఖలాలు లేవని బీజేపీ చీఫ్ ధ్వజమెత్తారు. యూరి తరువాత లక్షిత దాడులు జరిగినా పాకిస్తాన్‌కు బుద్దిరాలేదని ఆయన విమర్శించారు.